'ఆచార్య'లో మహేశ్ నటిస్తున్నారన్న వార్తలపై తొలిసారి స్పందించిన చిరంజీవి!

06-04-2020 Mon 11:01
  • 'ఆచార్య'లో మహేశ్ నటిస్తున్నారని వార్తలు
  • మహేశ్ గొప్ప నటుడు, అవకాశం వస్తే నటిస్తా
  • ఈ సినిమా కోసం మాత్రం సంప్రదించలేదు
  • ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి
Chiranjeevi Comments on Maheshbabu About Acharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.  దీనిపై ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, మధ్యలో మహేశ్ స్థానంలో రామ్ చరణ్ నటిస్తున్నారని ఓ మారు, కాదు, అల్లు అర్జున్ ఆ అవకాశాన్ని అందుకున్నాడని మరోమారు పుకార్లు వచ్చాయి. వీటిపైనా చిత్ర యూనిట్ స్పందించలేదు.

తాజాగా, ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి, తనతో పాటు మహేశ్ నటిస్తున్నారన్న విషయంపై స్పష్టత ఇచ్చారు. "అసలు 'ఆచార్య' చిత్రంలో మహేశ్ బాబు నటించనున్నారన్న వార్త ఏ విధంగా పుట్టిందో నాకు తెలియడం లేదు. ఓ అద్భుతమైన నటుడు మహేశ్ బాబు. మహేశ్ ను నేను చాలా గౌరవిస్తాను. మహేశ్ కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. అతను నాకు కొడుకు వంటివాడు. భవిష్యత్తులో అతనితో కలిసి నటించే అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను. కానీ ఈ చిత్రంలో నటించాలని ఆయన్ను సంప్రదించలేదు. ఈ వార్తలన్నీ పుకార్లే" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఇక, ఈ సినిమాలో ఓ పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని ముందు నుంచి కొరటాల భావిస్తూ వచ్చారని, అయితే, రాజమౌళి చిత్రంలో రామ్ చరణ్ బిజీగా ఉన్నందున తన చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేనని రామ్ చరణ్ ఇప్పటికే తెలిపాడని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కొరటాల, రాజమౌళి, రామ్ చరణ్ చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తే, రామ్ చరణ్ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.