BJP: మీరంతా ఈ రోజు ఒక పూట భోజనం మానేయాలి: పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ పిలుపు

Give up one meal to mark BJP foundation day says modi

  • బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు సూచన
  • కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా ఈ పని చేయాలన్న మోదీ
  • ప్రతి కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని నడ్డా పిలుపు

బీజేపీ కార్యకర్తలందరూ ఈ రోజు ఒక పూట భోజనం మానేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనికి కారణం లేకపోలేదు. నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం. సాధారణంగా అయితే ఇలాంటి రోజు పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం ఉండాలి. కానీ, ఇప్పుడు  కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.

ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పోరాడుతున్న వారికి సంఘీభావంగా ఒక పూట భోజనం మానేయాలన్న పార్టీ సూచనను కార్యకర్తలంతా పాటించాలని  కోరారు. వారందరికీ శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. అలాగే, బీజేపీని ఈ స్థాయికి తీసుకురావడంలో కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారని, వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు.

బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా కూడా కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని సూచించారు. లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వివిధ రూపాల్లో సంఘీభావం తెలపాలన్నారు. ఈ రోజు ఒక పూట భోజనం మానేయడంతో పాటు ‘ఫీల్ ద నీడ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రతి  కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు.

  • Loading...

More Telugu News