ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: కీర్తి సురేశ్

06-04-2020 Mon 10:07
  • కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ 
  •  ఆమె పెళ్లంటూ వార్తలు 
  •  కొట్టిపారేసిన కీర్తి సురేశ్
Keerthi Suresh

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. వరుసగా స్టార్ హీరోల జోడీ కడుతూ, వరుస విజయాలను అందుకుంటూ తన కెరియర్ ను ఆమె పరుగులు తీయిస్తోంది. 'మహానటి' తరువాత ఆమె  తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన కథలనే అంగీకరించడం విశేషం. ఆమెను వెతుక్కుంటూ బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్న నేపథ్యంలో, కీర్తి సురేశ్ పెళ్లి వార్త ఒకటి తెరపైకి వచ్చింది.

కేరళకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి కుదిరినట్టుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై కీర్తి సురేశ్ వెంటనే స్పందించకపోవడం వలన, ఈ వార్తలు మరింత వేగంగా దూసుకెళుతున్నాయి. దాంతో కీర్తి సురేశ్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ .. "నాకు కూడా ఇది ఒక సర్ప్రైజ్ లా వుంది .. ఈ పుకారు ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. కెరియర్ పైనే పూర్తి దృష్టి పెడుతున్నాను" అని చెప్పుకొచ్చింది. కీర్తి సురేశ్ ఇచ్చిన క్లారిటీతో పుకార్లకు తెరపడిపోయిందనే అనుకోవాలి.