Raghuram Rajan: స్వాతంత్ర్యం తరువాత అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఇండియా: రఘురామ్ రాజన్

  • గ్రేటెస్ట్ ఎమర్జెన్సీలో ఇండియా
  • 2008-09 నాటి మాంద్యం పరిస్థితిని తట్టుకుని ఇండియా నిలబడింది 
  • ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు
  • మహమ్మారి కట్టడికి మరిన్ని చర్యలు తప్పనిసరి
Rajan Says India is in Greatest Emergency after Independence

కరోనా వైరస్ ప్రభావంతో, భారతావని స్వాతంత్ర్యానంతరం అత్యంత గడ్డు పరిస్థితుల్లోకి కూరుకుపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008-09లో ఏర్పడిన ఆర్థికమాంద్యం ప్రపంచంపై ఎంత ప్రభావాన్ని చూపినా, ఇండియాపై మాత్రం తక్కువ ప్రభావాన్నే చూపిందని, కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధమని, ఎటు చూసినా అన్నీ ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నాడు ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ సిస్టమ్ బలంగా ఉన్న కారణంగా ఇండియా నిలిచిందని రాజన్ అంచనా వేశారు.

"ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే, ఇండియా ఇప్పుడు గ్రేటెస్ట్ ఎమర్జెన్సీలో ఉన్నట్టే. అన్ని రకాల వస్తు ఉత్పాదనలకూ డిమాండ్ దారుణంగా పడిపోయింది. 2008-09లో డిమాండ్ లేకున్నా, పరిశ్రమలు పని చేశాయి. మన వర్కర్లు పనికి వెళ్లారు. ఎన్నో సంవత్సరాలు బలమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన కంపెనీలు, బలమైన ఆర్థిక వ్యవస్థ... ఇప్పుడవేవీ కనిపించడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఇండియా దిగజారిపోయింది" అని లింకెడిన్ కు రాసిన వ్యాసంలో రాజన్ అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో ఇండియాలో ఉన్న వనరులు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సహకారంతో కరోనా వైరస్ ను జయించే అవకాశాలు కూడా ఉన్నాయని, రేపటి భారత పరిస్థితిపై అదే నమ్మకాన్ని పెంచుతోందని రాజన్ వ్యాఖ్యానించారు. కరోనా మరింతగా వ్యాపించకుండా తక్షణ చర్యలు తీసుకోవడమే భారత్ ముందున్న తక్షణ లక్ష్యమని వ్యాఖ్యానించిన ఆయన, టెస్టింగ్ లాబొరేటరీలు పెంచాలని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ క్వారంటైన్ కు తరలించాలని, సామాజిక దూరం తప్పనిసరని ఆయన సూచించారు.

"ఇండియాలో అమలవుతున్న 21 రోజుల లాక్ డౌన్, కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించుకునే సమయాన్ని ఇచ్చింది. వైద్య సిబ్బంది, అందుబాటులోని వనరులు, ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ విభాగాల్లోని పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కరోనాపై పోరాటంలో భాగం చేసే వీలును దగ్గర చేసింది. రక్త నమూనాల పరీక్షలు పెరిగితేనే అనిశ్చితి తొలగుతుంది. ఈ దిశగా ప్రభుత్వమే కల్పించుకోవాలి. కరోనా రోగుల సంఖ్య ఎక్కడ అధికమో తెలుసుకోగలిగితే, ఆ ప్రదేశంలో మరింత దృష్టిని కేంద్రీకరించే వీలు కలుగుతుంది" అని రఘురామ్ రాజన్ అన్నారు.

లాక్ డౌన్ ముగిసే సమయానికి వైరస్ ను జయించలేక పోతే, ఏం చేయాలన్నదానిపై ఇండియా ఇప్పుడు ప్రణాళికలు రూపొందించుకోవాల్సి వుందని రాజన్ వ్యాఖ్యానించారు. దేశమంతటినీ మరింత సమయం పాటు లాక్ డౌన్ లో ఉంచడం చాలా కష్టమైనపనని, తక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చవచ్చని ఆయన సూచించారు. ఆయా ప్రాంతాల్లోనూ మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్ సలహా ఇచ్చారు.

ఇదే సమయంలో ఇండియాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, లాక్ డౌన్ కారణంగా రోజువారీ పనిని కోల్పోయిన వారిపై మరింత శ్రద్ధ పెట్టాలని, అల్పాదాయ వర్గాలను కేంద్రం ఆదుకుని, వారు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడకుండా చూడాలని కోరారు. బ్యాంకు ఖాతాల్లోకి నగదు బట్వాడా అత్యధికులకు చేరినా, అందరికీ చేరుతుందని భావించలేమని, ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. పేదలకు నెలకు సరిపడినంత మొత్తాన్ని అందించడం లేదన్న అభిప్రాయం కూడా నెలకొనివుందని రాజన్ అభిప్రాయపడ్డారు.

అన్నింటికన్నా మించి, వలస కార్మికుల సమస్య చాలా పెద్దదని, లాక్ డౌన్ తరువాత, వారు తిరిగి పనిలో చేరేంత వరకూ కూడా సమస్య తొలగినట్టుగా భావించలేమని రాజన్ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక దిగ్గజాలు, చిన్న కంపెనీల్లో నిధుల కొరత రాకుండా చూసుకోవాలని సూచించిన రాజన్, కార్పొరేట్ బాండ్ మార్కెట్లు కూడా ఇందుకు సహకరించాలని అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలు తమ పెట్టుబడులను మరింతగా పెంచడం ద్వారా, నగదు లభ్యతను కొనసాగించ వచ్చని సూచించారు.

More Telugu News