ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అవకాశం అందరికీ దొరకదు: సినీ నటి మీనా

05-04-2020 Sun 15:27
  • మన ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను క్రమశిక్షణతో పాటిద్దాం
  • మనమంతా ఇంట్లోనే ఉందాం
  • ‘కోవిడ్-19’ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం
Cine Artist Meena precautions about corona virus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సినీ ప్రముఖులు పలువురు ఇప్పటికే తమ సందేశాల ద్వారా తెలిపారు. తాజాగా, సినీ నటి మీనా స్పందించింది. ఈ మహమ్మారి కట్టడి కోసం, మన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం బాధగా ఉందని పేర్కొంది.

ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాంటి  ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలుసా? అని ప్రశ్నించిన మీనా, ఆయా దేశాల్లో ఒక రోజులోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అదే, అమెరికా దేశంలో అయితే రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్ తో ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి పరిస్థితి మనకు రావొద్దని అన్నారు. ‘ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అవకాశం అందరికీ దొరకదు’ అని చెప్పిన మీనా, మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుంది’ అని సూచించింది.