Britain: 5జీ స్మార్ట్ ఫోన్లకు, కరోనాకూ లింక్ ఉందట... మొబైల్ టవర్లను ధ్వంసం చేస్తున్న బ్రిటన్ వాసులు!

Britishers Vandalise Mobile Towers After Fake News
  • బ్రిటల్ లో మొదలైన కొత్త ప్రచారం
  • 'డేంజరస్ నాన్సెన్స్' అన్న బ్రిటన్
  • ఎమర్జెన్సీ రిస్క్ పెరుగుతుందంటున్న నిపుణులు
5జీ మొబైల్ కమ్యూనికేషన్స్, కరోనా వైరస్ కూ సంబంధముందని, 5జీ స్మార్ట్ ఫోన్ల తరంగాల ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ప్రచారం అవుతున్న సిద్ధాంతం ఓ 'డేంజరస్ నాన్సెన్స్' (ప్రమాదకర అజ్ఞానం) అని బ్రిటన్ వ్యాఖ్యానించింది. ఈ తరహా తప్పుడు ప్రచారం అనర్ధాలకు దారి తీస్తుందని, ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. 5జీ తరంగాలకు, కరోనాకు లింక్ పెడుతూ ఓ పోస్ట్ బ్రిటన్ లో శనివారం నాడు తెగ వైరల్ కాగా, బ్రిటన్ మంత్రి మైఖేల్ గోవ్ స్పందించారు. ప్రజలను మరింతగా ప్రమాదంలో పడేసే ఈ తరహా ప్రచారం కూడదని సలహా ఇచ్చారు.

ఇక ఇదే విషయమై స్పందించిన ఎన్.హెచ్.ఎస్  ఇంగ్లాండ్ నేషనల్ మెడికల్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్, 5జీ వివాదాస్పద సిద్ధాంతం, వదంతేనని, దీని వెనుక ఎటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ లేదని, ఎమర్జెన్సీని డ్యామేజ్ చేస్తే రిస్క్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎవరో అజ్ఞానులు, ప్రజల్లో ఆందోళన పెంచేందుకు ఈ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ నెట్ వర్క్ లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రజల ఆరోగ్యానికి కీడే అయినా, కరోనాకు, దీనికి సంబంధం లేదని అన్నారు.

"ఇవే ఫోన్ నెట్ వర్క్ లను మన అత్యవసర విభాగాలు, హెల్త్ వర్కర్లు, డాక్టర్లు వాడుతున్నారు. ఈ తప్పుడు వార్తలతో ప్రజలు సెల్ ఫోన్ టవర్లపై ఆగ్రహాన్ని చూపుతున్నారు. దీంతో మౌలిక వసతులు దెబ్బతిని, మరిన్ని సమస్యలు వచ్చేలా ఉన్నాయి. హెల్త్ ఎమర్జెన్సీపై స్పందించాల్సిన ఈ పరిస్థితుల్లో ఇటువంటి సమస్యలు వస్తే, పరిస్థితి మరింత విషమిస్తుంది" అని పోవిస్ హెచ్చరించారు.

కాగా, ఈ వదంతి వ్యాపించిన తరువాత సెంట్రల్ ఇంగ్లండ్ పరిధిలోని బర్మింగ్ హామ్ ప్రాంతంతో పాటు ఉత్తరాదిన ఉన్న మెర్సీసైడ్ ఏరియాలో ప్రజలు మొబైల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేశారు. ఇక యూకే మొబైల్ ఆపరేటర్లలో ప్రధానమైన ఈఈ, ఓ2, వోడాఫోన్ తదితర సంస్థలు, వైరస్ వ్యాప్తికి, 5జీ తరంగాలకూ సంబంధం లేదని, తప్పుడు వార్తల కారణంగా, ఈ విపత్కర పరిస్థితుల్లో తాము మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టి వేయబడుతున్నామని వాపోయాయి. ఇక, టవర్ల మరమ్మతులకు వెళుతున్న తమ సిబ్బందిపైనా దాడులు జరుగుతున్నాయని, పోలీసులు రక్షణ కల్పించాలని యూకే మొబైల్ కోరింది.
Britain
Signals
Corona Virus
5G

More Telugu News