మోదీ జీ... ఎంతో చేస్తున్నారు. ఇది కూడా చేయండి: ట్రంప్ విజ్ఞప్తి!

05-04-2020 Sun 08:46
  • ఇండియా నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధం
  • భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చిన అమెరికా
  • తమ దేశానికి పంపించాలని మోదీని కోరిన ట్రంప్
Trump Asks to lift ban on Hydroxychloroquine

కొవిడ్-19 పేషంట్లకు చికిత్స చేసేందుకు మలేరియా నిరోధానికి వాడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. "నేడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన తరువాత, హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను యూఎస్ కు పెద్దఎత్తున సరఫరా చేసేందుకు భారత్ ఆలోచిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న నిషేదాన్ని తొలగించేందుకు యోచిస్తోంది. నేను నరేంద్ర మోదీని హైడ్రాక్వీ క్లోరోక్విన్ టాబ్లెట్ల కోసం విజ్ఞప్తి చేశాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వైట్ హౌస్ లో కరోనా టాస్క్ ఫోర్స్ తో మాట్లాడిన ఆయన, 100 కోట్ల మందికి పైగా ప్రజలను కలిగివున్న భారత్ లో కరోనా కట్టడికి ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు. నేను కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ ను ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నానని, ఈ విషయాన్ని చెప్పడానికి తానేమీ సిగ్గు పడటం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన డాక్టర్లతో మాట్లాడిన తరువాత టాబ్లెట్ వేసుకున్నానని తెలిపారు.

ఈ ఔషధం కోసం అమెరికా ఇప్పటికే భారత్ కు ఆర్డర్ అందించిందని, అయితే, ప్రస్తుతం భారత నిషేధం అమలులో ఉన్నందున ఇంకా సరఫరా జరగలేదని, ఈ విషయంలో తమకు సహకరించాలని కోరానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇండియాలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వ చాలా అధికంగా ఉందని వ్యాఖ్యానించిన ట్రంప్, అక్కడి మెడికల్ షాపుల్లో సైతం ఈ డ్రగ్ విరివిగా లభిస్తోందని, అయితే, కోట్లాది మంది ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాంటీ మలేరియా డ్రగ్ నిల్వలను వ్యూహాత్మకంగా వాడుకోవాలని తాను సూచించానని అన్నారు. యూఎస్ కోరిన విధంగా టాబ్లెట్లను ఎగుమతి చేస్తే, తాను ఎంతో సంతోషిస్తానని మోదీకి తెలియజేసినట్టు వ్యాఖ్యానించారు.

కాగా, ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్, దాని ఫార్ములేషన్స్ ఎగుమతిపై భారత్ లో నిషేదం అమలవుతూ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ట్రంప్ తో మాట్లాడటంపై స్పందించిన మోదీ, తమ మధ్య సంభాషణ సంతృప్తిని ఇచ్చిందని, కొవిడ్-19పై పోరులో ఇరు దేశాలూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. యూఎస్ లో మృతులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపానని అన్నారు.