ముంబై మురికివాడ ధారావిలో కలకలం.. పెరిగిపోతోన్న కరోనా కేసులు

04-04-2020 Sat 19:08
  • పది లక్షల మందికిపైగా పేదవారు ఉండే ధారావి
  • మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌
  • ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు
2 More Test Positive For Coronavirus In Mumbais Dharavi

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరు పొందిన ముంబయిలోని 'ధారావి'లో కరోనా కలకలం చెలరేగుతోంది. ఈ ప్రాంతంలో పది లక్షల మంది కంటే ఎక్కువ మంది నివాసం ఉంటారు. ఇక్కడ ఇటీవల కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో అధికారులు అప్రమత్తమై అక్కడి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం ధారావిలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించారు. ఈ రోజు అదే ప్రాంతంలో ఇంకో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

వారిలో 35 ఏళ్ల ఓ వైద్యుడు కూడా ఉండడం గమనార్హం. దీంతో ధారావిలో కరోనా సోకిన వారి సంఖ్య మృతి చెందిన వ్యక్తితో కలిసి ఐదుకి చేరింది. ప్రస్తుతం బాధితులందరికీ చికిత్స అందిస్తున్నారు. ఇక వీరితో కలిసి మెలసి ఉన్న వారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు.

ముంబయి విమానాశ్రయానికి సమీపంలో ఉండే ధారావిలో 70 శాతం మంది ప్రజలు కమ్యూనిటీ టాయిలెట్లనే వాడతారు. చిన్న పరిశ్రమలు, వర్క్ షాపులు వంటివి కూడా అక్కడ పనిచేస్తాయి. జనాలు కలిసి మెలసి ఉండే ధారావిలో కరోనా విజృంభిస్తే కట్టడి చేయడం కష్టమని అధికారులు ఆందోళన చెందుతున్నారు.