ఇద్దరి ప్రాణాలు తీసిన పోలీసు సైరన్!

04-04-2020 Sat 09:43
  • పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విషాదం
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • పాలకొల్లులో ఒకరు, వెంకటాపురంలో మరొకరు మృతి
Two people died with heart attack while listening to police siren

పోలీసు వ్యాన్ సైరన్ విని భయంతో పరుగులు పెట్టిన ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పాలకొల్లులోని  లజపతిరాయ్‌పేటలో నిన్న ఉదయం జనం పెద్ద సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో పోలీసులు వస్తున్నట్టు సైరన్ రావడంతో వారికి దొరక్కుండా ఉండేందుకు తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు.

ఈ క్రమంలో పట్టణానికి చెందిన వేండ్ర వీరాంజనేయులు (57) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చింతలపూడి మండలం వెంకటాపురంలో జరిగిన మరో ఘటనలో పసుమర్తి భాస్కరరావు (55) పోలీసు వ్యాన్ సైరన్ విని తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు ప్రకటించారు.