కేంద్రీయ, నవోదయ విద్యాలయ ప్రవేశాల్లో 27 శాతం ఓబీసీ కోటా

03-04-2020 Fri 15:37
  • తొలిసారి ఓబీసీ కోటా అమలు చేయాలని నిర్ణయం
  • ఈ విద్యా సంవత్సరంలో 1200 పాఠశాలల్లో అమలు
  •  ఒకటో తరగతి ప్రవేశాలకు వర్తింపు  
KVs and JNVs to have 27 percent OBC quota

కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయాల్లో తమ పిల్లల్ని చదివించాలని అనుకుంటున్న ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) లకు శుభవార్త. ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి కేవీ, జేఎన్‌వీల్లో 27 శాతం ఓబీసీ కోటా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 1200 విద్యాలయాల్లో  ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ  కోటా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ... కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్)కు లేఖ రాసింది. పాలసీ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఓబీసీల సంక్షేమం  కోసం ఏర్పాటైన  పార్లమెంటరీ కమిటీ గతేడాది డిసెంబర్లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కోటాపై నిర్ణయం తీసుకున్నారు.

కేవీ అడ్మిషన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్)కి 25 శాతం, ఎస్‌సీలకు15 శాతం , ఎస్టీలకు 7.5 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. అలాగే, వికలాంగులకు మూడు శాతం కోటా ఉంది. దీంతో పాటు ఐదు సీట్లను డిఫెన్స్, రైల్వేస్, ప్రభుత్వ రంగ సంస్థలు సిఫారసు చేసిన వారికి ఇస్తున్నారు.

మొదటిసారి ఓబీసీ కేటగిరీని చేర్చడంతో పాటు అడ్మిషన్ గైడ్‌లైన్స్‌లో మార్పు చేస్తున్నట్టు కేవీలు, జేఎన్‌వీలకు రాసిన లేఖలో మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్‌ మొదటి తరగతిలో 10 సీట్లు ఆర్టీఈకి, ఆరు సీట్లు ఎస్‌సీలకు, మూడు సీట్లు ఎస్టీలకు, 11 సీట్లు ఓబీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది.