Corona Virus: భారత ఐటీ కంపెనీల పరిస్థితి ఏమిటి?.. నిపుణులు ఏమంటున్నారు?

  • పడిపోనున్న ఐటీ సంస్థల వృద్ధి 
  • అమెరికా, యూరప్‌ నుంచి క్లయింట్లను కోల్పోయే అవకాశం
  • క్లయింట్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేసే అవకాశం
  • కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌనే కారణం
Coronavirus attack to slow down IT growth

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజ సంస్థల వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం గణనీయంగా పడిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ ప్రభావం కారణంగా అమెరికా, యూరప్ దేశాల నుంచి టాటా కన్సల్టన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కి ఉండే క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

కరోనా ప్రభావంతో రానున్న ఆరు నెలల్లో (ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో) తీసుకునే నిర్ణయాల కారణంగా ఐటీ రంగంలో రెవెన్యూ 2 నుంచి 7 శాతం మధ్య పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత సాఫ్ట్‌వేర్‌, సర్వీసెస్‌ ఎక్స్‌పోర్ట్‌ వృద్ధి 2020 ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం (147 బిలియన్‌ డాలర్లు )గా ఉందని ఇటీవల నేషనల్ అసోసియేషన్‌ ఆఫ్ సాఫ్ట్‌ వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ అభిప్రాయపడింది. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా సమీప భవిష్యత్తులో ఐటీ సంస్థలు రెవెన్యూను భారీగా కోల్పోయే అవకాశం ఉంది.

క్లయింట్ల బ్యాంక్‌రప్ట్సీ (దివాలా) పెరిగే అవకాశం ఉండడంతో పాటు క్లయింట్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. 6-8 శాతం మధ్య ఉండాల్సిన భారత ఐటీ కంపెనీల వృద్ధి రేటు కరోనా ప్రభావం కారణంగా 3-6 శాతం మధ్య ఉండే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

                  
ఆర్థిక సంవతసరం ముగిసినప్పటికీ ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో వంటి కంపెనీలు ఇప్పటికీ తమ వృద్ధి రేటుపై ప్రకటన చేసే తేదీ గురించి ప్రస్తావించట్లేదు. సాధారణంగా ఐటీ సంస్థలు ఏప్రిల్‌ రెండో వారంలో వృద్ధి రేటుని ప్రకటిస్తాయి. కొన్ని వారాలుగా భారతీయ కంపెనీలకు ఉన్న క్లయింట్లు తమ ప్రాజెక్టులను రద్దు చేసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా విమాన సేవల రద్దు, నగరాల మూసివేత, సామాజిక దూరం నిబంధనలు వంటి నిర్ణయాలే ఇందుకు కారణం. ప్రపంచ దేశాల జీడీపీ పడిపోనుందని, అయితే భారత్‌, చైనా మాత్రం  ఆ ప్రమాదంలోకి జారుకునే అవకాశాలు అంతగా లేవని ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్‌ కంపెనీ గోల్డ్‌మన్‌సాచ్స్‌ ప్రకటించింది.

పర్యాటకం, ఆతిథ్యం, విమానయాన, రీటైల్, హై-టెక్‌, ఆయిల్ అండ్ గ్యాస్, ఆర్థిక సేవలు, తయారీ రంగాల క్లయింట్లపై కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా పడనుంది. కాగా, చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం భారతీయ ఐటీ కంపెనీలపై పరోక్షంగా పడనుందని నిపుణులు అంటున్నారు.

More Telugu News