ఏటూరు నాగారంలో కిరాణా షాపు నిర్వాహకులకు కరోనా... వందల మందిలో ఆందోళన!

03-04-2020 Fri 12:48
  • మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఇద్దరు
  • ఆపై కిరాణా షాపులో కూర్చుని వ్యాపారం
  • ఏటూరు నాగారంలో 144 సెక్షన్ అమలు
Two Kirana Shop Owners gets Positive in Mulugu dist
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇద్దరు కిరాణా షాపు నిర్వాహకులకు పాజిటివ్ రావడంతో, వారి షాపుల్లో సరుకులు కొన్న వందలాది మందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఇద్దరు బాధితులూ మార్చిలో జరిగిన మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే కావడం గమనార్హం. 18న వీరిద్దరూ ఇళ్లు చేరి, ఆపై నిత్యావసరాలు విక్రయించారు. లాక్ డౌన్ ప్రారంభమైన తొలి నాళ్లలో వీరిద్దరి వద్దకూ పెద్దఎత్తున వచ్చిన ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడంతో, వారందరిలోనూ ఆందోళన నెలకొంది.

ఇద్దరికీ కరోనా లక్షణాలు కనిపించగా, రక్త నమూనాలు సేకరించిన అధికారులు, ఇద్దరికీ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. దాంతో వారిని హైదరాబాద్, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆపై నిన్న వారి ఇళ్లకు వెళ్లి 26 మంది కుటుంబీకులను తాడ్వాయిలోని హరిత హోటల్ కాటేజీకి తరలించి క్వారంటైన్ చేశారు. వీరు ఎవరెవరిని కలిశారన్న విషయాన్ని విచారిస్తున్నారు.

ఇక ఏటూరు నాగారం, వీరి దుకాణాలు ఉన్న గోవిందరావు పేటలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్న పోలీసులు, పట్టణానికి వచ్చే అన్ని రహదారులనూ మూసివేశారు. ఫైరింజన్లలో సోడియం హైపోక్లోరైడ్ ను తెచ్చి, రోడ్లపై పిచికారీ చేయించారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికీ మినహా, వారి కుటుంబీకులెవరిలోనూ ప్రాథమిక అంచనాల ప్రకారం, వైరస్ లక్షణాలు లేవని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.