India: ఏప్రిల్ 15 నుంచి ఇండియా పరిస్థితి ఏమిటి?.. ఓ విశ్లేషణ!

  • లాక్ డౌన్ తో భారత్ కు భారీగా ఆర్థిక నష్టం
  • ఒక్క రోజు సరాసరి జీడీపీ విలువ  8 బిలియన్ డాలర్లు
  • సంస్థలు, ఎగుమతులపై భారీ ప్రభావం
India after april 15th

కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 14న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి ఇండియా పరిస్థితి ఏంటనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిలిచిపోయిన వ్యాపార, వాణిజ్య రంగాలను మళ్లీ పట్టాలు ఎక్కించాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వ పెద్దలు ఏం చేయబోతున్నారనే ప్రశ్న అందరిలో ఉంది. అన్ని రంగాలను అన్ లాక్ చేయడంతో పాటు... ప్రతి ఒక్కరిని 'రిటర్న్ టు వర్క్' చేయాల్సి ఉంది.

లాక్ డౌన్ కాలంలో మన ఆర్థిక నష్టాన్ని రోజువారీగా లెక్కించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ తో కోల్పోయిన దాన్ని... రోజువారీ లక్ష్యాలతో మళ్లీ చేరుకోవాలి. కరోనా మహమ్మారికి ముందు 2021 ఆర్థిక సంవత్సరానికి  గాను మన జీడీపీ అంచనాల ప్రకారం... రోజువారి సరాసరి జీడీపీ విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు. ఈ లెక్క ప్రకారం 30 రోజుల లాక్ డౌన్ లో మనం నష్టపోయేది దాదాపు  240 బిలియన్ డాలర్లు. అయితే ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో ఈ నష్టాన్ని పూడ్చుకునే అవకాశాలు  కొంత మేర ఉన్నాయి. దీని గురించి నిపుణులు చెబుతున్నది ఇదే.

వస్తువుల డిమాండ్ పై ప్రభావం:

ప్రైవేట్ వినియోగంలో (ఖర్చు) దీర్ఘకాల వస్తువుల వాటా 11 శాతంగా ఉంటుంది. దీర్ఘకాల వస్తువులు కాని వాటి శాతం దాదాపు 39 శాతం ఉంటుంది. ఇందులో (39 శాతం) నిత్యావసరాలు, ఆహారం, బెవరేజెస్ ల వాటా 75 శాతం దాటుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

వివిధ రకాల సేవలకు (సర్వీసెస్) దాదాపు 50 శాతం డిమాండ్ ఉంటుంది. వృద్ధి రేటులో సర్వీసెస్ ది కీలక పాత్ర. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో ఈ సేవలకు డిమాండ్ తగ్గొచ్చు. ఇలాంటి సేవలు (సినిమాలు, రెస్టారెంట్లు, తదితరాలు) స్థిరమైన నష్టాలను నమోదు చేయొచ్చు.

ప్రజల కొనుగోలు శక్తి 30 నుంచి 35 శాతం వరకు పడిపోతుంది. వాహనాలు, ఫర్నిషింగ్, ఫుట్ వేర్, దుస్తులు తదితర డ్యూరబుల్ వస్తువుల కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకుంటారు. లాక్ డౌన్ ను వెంటనే ఎత్తివేయకుంటే ట్రాన్స్ పోర్ట్, రీక్రియేషన్, హోటల్స్, బెవరేజస్ వంటివాటి డిమాండ్ దారుణంగా పడిపోతుంది.

పూర్థి స్థాయిలో నష్టాన్ని పక్కాగా అంచనా వేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ప్రజల ఆరోగ్యంపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉంటుంది? కరోనా ఎఫెక్ట్ ఎంత కాలం కొనసాగుతుంది? కరోనా నష్టాల నుంచి బయట పడేందుకు ఎలాంటి పాలసీలను తీసుకురావాలి? అనేవి ఇప్పటికిప్పుడు చెప్పలేం.

గతంలో ప్రపంచాన్ని మహమ్మారులు అతలాకుతలం చేసినప్పటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఓ అంచనాకు వస్తే... మూడు నెలల లాక్ డౌన్ 2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంపై 11.5 పర్సెంటేజ్ పాయింట్స్ వరకు ప్రభావాన్ని చూపొచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో 6.5 బిలియన్ డాలర్ల నష్టం... 2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 45 బిలియన్ డాలర్ల నష్టం ఉండొచ్చు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.  

పారిశ్రామిక ఉత్పత్తి, పెట్టుబడులు, ఎగుమతులు:

దేశ వ్యాప్తంగా ఒక నెల పాటు ఫ్యాక్టరీలన్నీ మూతపడితే... పారిశ్రామికోత్పత్తి 2021 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం పడిపోతుంది. 1992 తర్వాత ఈ స్థాయిలో పతనం కానుండటం ఇదే ప్రథమం. పారిశ్రామిక రంగానికి 31 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. రానున్న రోజుల్లో పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి. ఎగుమతులకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగులుతుంది.

సంస్థలకు ఆర్థిక కష్టాలు:

పలు సంస్థలు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటాయి. వాటి షేర్ వాల్యూ పడిపోతుంది. లిక్విడిటీ సమస్యలు అధికమవుతాయి. అప్పులు పెరిగి... దాని ప్రభావం ఉత్పాదకతపై పడుతుంది. సమస్య నుంచి ఒక్కసారిగా సంస్థలు గట్టెక్కలేవు. అందువల్ల త్రైమాసికాల వారీగా  ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాలి.

ఆర్థిక వృద్ధి అనేది ఈ మహమ్మారి ఎంతకాలం ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సమయానుకూలంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి.

More Telugu News