World Bank: ఇండియాకు రూ. 7,583 కోట్ల సాయం: వరల్డ్ బ్యాంక్

  • భారత హెల్త్ సెక్టార్ కు అత్యధిక సాయం
  • మహమ్మారి బలపడకుండా మరిన్ని చర్యలు
  • హెల్త్ సిస్టమ్ ను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం
Huge Support form World bank to India

కరోనా వైరస్ బారి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు వరల్డ్ బ్యాంకు బిలియన్ డాలర్లను (సుమారు రూ. 7,583 కోట్లు) సాయం చేయనుంది. ఇండియాలోని హెల్త్ సెక్టార్ కు వరల్డ్ బ్యాంకు నుంచి అందనున్న అతిపెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం. ఈ నిధిని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజస్ కంట్రోల్ (ఎన్సీడీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లు సంయుక్తంగా ఖర్చు చేయనున్నాయి. కరోనా మహమ్మారి బలపడకుండా చూసేందుకు అవసరమైన కొత్త పరికరాలు, వ్యాధి బారిన పడిన వారికి ఉపయోగపడే మౌలిక వసతులు, డాక్టర్ల రక్షణకు అవసరమైన సూట్లు, మాస్క్ ల తయారీకి ఈ నిధులను వాడుకోవచ్చు.

దేశంలో ఇన్ ఫెక్షన్ బారిన పడ్డ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రిస్క్ అధికంగా ఉన్న ప్రాంతాలు, మెడికల్ అండ్ ఎమర్జెన్సీ సేవల్లో పాల్గొనే వ్యక్తులు, టెస్టింగ్ కేంద్రాలు, నేషనల్ అండ్ యానిమల్ హెల్త్ ఏజన్సీలు ఈ నిధిని వాడుకోవచ్చు. కాగా, తక్షణం నిధులు మంజూరు కానున్న నేపథ్యంలో, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సోకకుండా తీసుకునే చర్యలకు, వ్యాధి మరింత విస్తరించకుండా పటిష్ఠ చర్యలు చేబట్టేందుకు ఈ డబ్బు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ను బలోపేతం చేసేందుకు వీలు కలుగుతుంది.

More Telugu News