Corona Virus: వీధిలో కనిపిస్తే, కాల్చి పారేయమన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు... కఠినంగా వ్యవహరిస్తున్న పలు దేశాల పోలీసులు... వీడియో ఇదిగో!

  • ఎంత చెప్పినా నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రజలు
  • పలు దేశాల్లో పోలీసులకు పెరిగిన పని
  • భారీగా జరిమానాల విధింపు
  • ప్రజలు మారాలంటున్న నిపుణులు
Police Action Worldwide to control People

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోని దాదాపు 180 దేశాలు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలను కోరుతూ, లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వేళ, ఏ మాత్రమూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ, రోడ్లపైకి వస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వస్తోంది. అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చేవారి సంఖ్య పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుండగా, కర్ఫ్యూ తరహా నిబంధనలు ఉన్నా, ప్రజలు పాటించక పోవడాన్ని పలు దేశాల పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు.

ఫిలిప్పీన్స్ లో అయితే, రోడ్డుపై కనిపించిన వారిని కాల్చి పారేయాలని స్వయంగా అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. సౌతాఫ్రికాలో రోడ్లపైకి వచ్చిన వారితో పోలీసులు మండుతున్న రోడ్డుపై పొర్లు దండాలు పెట్టించారు. వీధుల్లోకి వచ్చిన వారిని అదుపు చేసేందుకు జొహానస్ బర్గ్ లో వాటర్ క్యానన్లు వినియోగించాల్సి వచ్చింది. రబ్బర్ బులెట్లను కూడా పోలీసులు ప్రయోగించారు. అపార్టుమెంట్లలోకి వెళ్లి, ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారా? లేదా? అన్న విషయాన్ని ఇక్కడి పోలీసులు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నందున నిబంధనలను అతిక్రమించే వారిని క్షమించే పరిస్థితి లేదని శాంతా క్రజ్ మునిసిపాలిటీ పరిధిలోని లాగునా ప్రావిన్స్ మేయర్ ఎడ్గర్ శాన్ లూయిస్ హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చిన వారిని ఇక్కడ కుక్కల బోనులో బంధించగా, విమర్శలు రావడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. నిబంధనలను పాటించని వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తే, ఆ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇక మెక్సికోలో కొందరు పోలీసులకు కూడా వైరస్ లక్షణాలు కనిపించడంతో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారికి, స్వీయ క్వారంటైన్ ను పాటించని వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇక పెరూ ప్రభుత్వం తప్పుడు కాల్స్ చేసేవారిపై 600 డాలర్ల జరిమానా విధించాలని నిర్ణయించింది. హాంకాంగ్ లో సామాజిక దూరాన్ని పాటించని వారిపైనా, హోమ్ క్వారంటైన్ లో లేని వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో 70 శాతం మంది నిబంధనలను అతిక్రమిస్తున్నారు. రోడ్లపై కనిపించిన వారిని, అక్కడే కఠినంగా శిక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుండగా, సింగపూర్ లోనూ కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం భారీ జరిమానాలను విధిస్తోంది. 10 మంది కన్నా అధికంగా ఓ చోట చేరితే క్రిమినల్ కేసులనూ పెడుతోంది.

ఇండియాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను పాటించని వారికి పోలీసులు వినూత్న శిక్షలను విధిస్తున్నారు. మధ్యప్రదేశ్ రోడ్లపైకి వచ్చిన యువకులను నిలబెట్టి, "నేను లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాను. నన్ను దూరంగా పెట్టండి" అని నినాదాలు చేయించారు. మరికొన్ని చోట్ల నిబంధనలు అతిక్రమించిన వారిపై లాఠీలు విరిగాయి. తిరుపతిలో ఒకే సమయంలో అన్ని కూడళ్ల వద్దా, పోలీసులు వాహనాలను ఆపి, వాటిపై వచ్చిన వారిని దాదాపు గంట పాటు ఎండలో నిలబెట్టి, మరోసారి ఇలా చేయబోమని వాగ్దానం చేయించారు.

తన నలుగురు కుటుంబ సభ్యులతో వీథిలోకి వచ్చిన ఓ వ్యక్తిని, ఆటో వెనక్కు తీసుకెళ్లిన పోలీసు, అతన్ని లాఠీతో కొట్టి, మరోసారి ఇలా రావద్దని హెచ్చరించి పంపాడు. ఇంకో ప్రాంతంలో పోలీసులు గుంజీలు తీయించారు. మరికొందరు పోలీసులు వాహనదారుల ముందు నిలబడి చేతెలెత్తి నమస్కరించారు. ఇంత జరుగుతున్నా ప్రజల్లో ఇంకా పూర్తి మార్పు రాలేదని, ప్రజలు మారకుంటే లాక్ డౌన్ ఉద్దేశాలు నెరవేరబోవని, వైరస్ ను అడ్డుకోలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News