DRDO: కరోనాపై పోరులో స్వదేశీ 'పీపీఈ'ని తయారు చేసిన డీఆర్డీఓ

  • డాక్టర్లు ధరించే సూట్లకు పెరుగుతున్న డిమాండ్
  • నానో టెక్నాలజీ సాయంతో తయారు చేసిన డీఆర్డీఓ
  • రోజుకు 15 వేల సూట్లను అందిస్తామని వెల్లడి
DRDO Develops Bio Suit for Doctors

కరోనా వైరస్ పై జరుపుతున్న పోరాటంలో తమవంతు పాత్రను పోషిస్తున్న వైద్యులకు రక్షణగా ఉండేందుకు డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) దేశవాళీ, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్)ను తయారు చేసింది. దేశంలోని పలు డీఆర్డీఓ ల్యాబొరేటరీల్లోని సైంటిస్టులు ఈ 'బయో సూట్' అభివృద్ధిలో పాలు పంచుకున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పీపీఈలకు ఎంతో డిమాండ్ ఉన్న కారణంగా, రోజుకు 15 వేల సూట్లను తయారు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యులు వైరస్ బారిన పడకుండా చూసే రక్షణ పరికరాలకు చాలా కొరత ఉంది. కరోనా వైరస్ సోకిన వారికి వైద్యులు, తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్సలు చేస్తున్న పరిస్థితి. పీపీఈలను, వెంటిలేటర్లను, ఎన్-95 మాస్క్ లను కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో డీఆర్డీయే తయారు చేసిన బయో సూట్ ఎంతో ఉపయుక్తకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,500 దాటగా, మృతుల సంఖ్య 70 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా వ్యాధి సోకగా, దాదాపు 50 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఇక దేశవ్యాప్తంగా డీఆర్డీఓ కేంద్రాల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు, నానో టెక్నాలజీ, టెక్స్ టైల్, కోటింగ్ తదితర సాంకేతికాంశాలను ఒకరితో ఒకరు పంచుకుని, ఈ పీపీఈని అభివృద్ధి చేశారని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దఎత్తున వీటిని తయారు చేసేందుకు పలు పరిశ్రమలతో చర్చలు జరిపామని, డాక్టర్లు, మెడికోలు, ఫ్రంట్ లైన్ లో ఉండే ఇతర వ్యక్తులకు వీటిని అందిస్తామని తెలిపారు.

ప్రస్తుతం డీఆర్డీఓ ల్యాబొరేటరీల్లో రోజుకు 1.5 లక్షల లీటర్ల శానిటైజర్ ను ఉత్పత్తి చేస్తున్నామని, ఐదు లేయర్ల ఫేస్ మాస్క్ ఎన్-99 తయారీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని, రోజుకు 10 వేల మాస్క్ లను తయారు చేస్తుండగా, దాన్ని 20 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే తాము ఢిల్లీ పోలీసులకు 40 వేల మాస్క్ లను అందించామని తెలిపారు.

More Telugu News