Corona Virus: కరోనా వైరస్ ఆచూకీ పట్టేసే కాగితం.. రూపొందించిన బ్రిటన్ యూనివర్సిటీ!

  • క్రాన్ ఫీల్డ్ వర్సిటీ పరిశోధకులు వినూత్న ఆవిష్కరణ
  • రసాయనాలు పూసిన కాగితంతో కరోనా టెస్టు
  • ప్రస్తుతానికి ప్రయోగశాలకే పరిమితమైన ప్రత్యేక కాగితం
Scientists Are Developing a Test to Find The New Coronavirus in Wastewater

ఓవైపు కరోనా మహమ్మారి తన పని తాను చేసుకుంటూ పోతుంటే, మరోవైపు పరిశోధకులు వైరస్ గుట్టు కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బ్రిటన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ఆసక్తికర పరిశోధన చేసింది. వ్యర్థ జలాల్లో కరోనా వైరస్ ఆచూకీని గుర్తించే ప్రత్యేకమైన కాగితాన్ని రూపొందించింది.

ఈ కాగితానికి కొన్ని రసాయనాలు పూస్తారు. ఈ కాగితంపై మురికి నీటిని పోస్తే అందులోని పలు పొరలు వ్యాధికారక క్రిముల న్యూక్లియిక్ యాసిడ్లను వడపోస్తాయి. ఒకవేళ ఆ నీటిలో కరోనా వైరస్ ఉంటే ఆ కాగితంపై ఆకుపచ్చని వలయం ఏర్పడుతుంది. కరోనా లేకపోతే నీలి రంగు వలయం కనిపిస్తుంది. మానవుల నుంచి విసర్జితాల ద్వారా బాహ్యప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా కరోనా వైరస్ రోజుల తరబడి సజీవంగా ఉంటోందన్న విషయం ఈ పరిశోధన ద్వారా గుర్తించారు.  కాలనీల నుండి వచ్చే డ్రైనేజీ కాలువలలోని మురికి నీటిని పరీక్షించడం ద్వారా ఆ కాలనీలో ఎవరికైనా వ్యాధి ఉందా? అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవడానికి ఈ విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నారు.

కాగా, ఈ ప్రత్యేక కాగితం తయారీకి అయ్యే ఖర్చు రూ.100 కన్నా తక్కువేనట. ఈ కాగితాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చని, పరీక్ష పూర్తయిన తర్వాత కాగితాన్ని కాల్చి వేయాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రయోగశాల వరకే పరిమితమైంది. జనబాహుళ్యంలోకి తీసుకువచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఝుగెన్ యాంగ్ అనే బయోమెడికల్ ఇంజనీర్ తెలిపారు.

More Telugu News