India: ఉత్పాదన లేనప్పుడు వేతనాలు ఎలా చెల్లిస్తాం?: సంకట స్థితిలో పరిశ్రమలు

  • పూర్తి వేతనం చెల్లించాలంటున్న కేంద్రం
  • ఉత్పత్తి లేకుంటే అదెలా సాధ్యమంటున్న పరిశ్రమలు
  • కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి
Indian Industries say cannot pay full Salaries to Employees in Lockdown

ఇండియా ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలు చాలా వరకు మూతపడ్డాయి. ఈ కంపెనీల్లో పని చేస్తున్న తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులంతా ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు.

 అత్యవసర వస్తువుల తయారీలో నిమగ్నమైన కంపెనీలు మాత్రమే, అది కూడా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో పని జరిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. విధుల్లోకి వచ్చినా, రాకున్నా, ఉద్యోగులందరికీ వేతనాలు ఇవ్వాల్సిందేనని కేంద్రం స్పష్టంగా చెప్పినా, ఆ పరిస్థితి లేదంటున్నాయి పరిశ్రమల యాజమాన్యాలు.

ప్రభుత్వం సూచించిన విధంగా వేతనాలు చెల్లించడం అసంభవమని, సంస్థల్లో ఉత్పత్తులు నిలిచి, ఆదాయం లేని ఈ సమయంలో వేతనాలను ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం తమకు అత్యవసరమని విన్నవిస్తున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ కల్పించుకుని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా అన్ ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ పెంచాలని విజ్ఞప్తి చేశాయి.

ఇక కేంద్రం సూచించినట్టుగా, వేతనాలు చెల్లించకుంటే ఏర్పడే చట్టపరమైన సమస్యల గురించి పరిశ్రమలు ఆలోచిస్తున్నాయి. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టంలోని నిబంధనలను పరిశీలిస్తున్నాయి. ఈ చట్టంలో వేతనాల చెల్లింపును కొనసాగించాలన్న నిబంధన లేదని వాదిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని విభాగాల్లో లేబర్ కొరత ఉందని, దీని కారణంగా అతి త్వరలోనే సప్లయ్ షార్టేజ్ ప్రమాదం కూడా ఏర్పడనుందని పారిశ్రామిక రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ కష్టకాలంలో వేతన జీవి బలి కాకూడదన్న కేంద్రం ఆలోచనను అత్యధిక కంపెనీల యాజమాన్యాలు అంగీకరిస్తున్నప్పటికీ, ఆదాయం లేని పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఏదైనా సాయం వస్తే, ఉద్యోగుల సంక్షేమంపై మరింత శ్రద్ధ పెట్టవచ్చన్న ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది.

కంపెనీల్లో మూలధనం నిల్వలపై ఒత్తిడి పెరిగిపోతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగానికి ఓ భారీ ఉద్దీపన ప్యాకేజ్ అవసరం ఎంతైనా ఉందని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ అభిప్రాయపడ్డారు.

"ప్రభుత్వాలకేం, వారు ఏమైనా చెబుతారు? వారా జీతాలు చెల్లించేది? నేను జీతాలు చెల్లిస్తున్నాను. 20 శాతం మంది ఉద్యోగులను తొలగించక తప్పనిసరి పరిస్థితి. ఇప్పటికే చాలా తక్కువ మార్జిన్లపై ఫ్యాక్టరీని నడుపుకుంటూ వస్తున్నాను" అని హిమాచల్ ప్రదేశ్ లోని బడ్డీలో ప్లాస్టిక్ ట్యాంకుల తయారీ కేంద్రాన్ని నడుపుతున్న ఎస్ సింగ్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇదే పరిస్థితి కొనసాగితే, మరో రెండు నెలల తర్వాత ఇండియాలో 5 నుంచి 7 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు మూతబడే ప్రమాదం ఉందని ఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు చంద్రకాంత్ సాలుంఖే హెచ్చరించారు. చిన్న యూనిట్లు చాలావరకు మహా అయితే ఓ నెల రోజుల జీతాలు మాత్రం ఇవ్వగలుగుతాయని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమని ఆదుకోవాలని అన్నారు.  

ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో అత్యవసరం కాని వస్తువులు తయారు చేస్తున్న కంపెనీలపై అత్యధిక ప్రభావం తప్పక పోవచ్చని ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మాధ్యమంగా ఇమిటేషన్ జ్యూయలరీని విక్రయిస్తున్న రాజా అగర్వాల్ అనే వ్యాపారి వాపోయాడు. ఏప్రిల్ నెల వరకూ పూర్తి జీతం చెల్లించాలని తాను నిర్ణయించుకున్నానని, ఆపై మాత్రం చేతులెత్తేయక తప్పదని ఆయన అన్నారు.

ఇక మరికొన్ని కంపెనీల ఉత్పత్తులకు లాక్ డౌన్ సమయంలో డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలు, పోలీసుల ఆంక్షల కారణంగా ఫ్యాక్టరీలకు రాలేని పరిస్థితి కూడా నెలకొని వుందని తెలుస్తోంది. వేతనాలు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నా, కార్మికులు ప్రభుత్వ ఆదేశాలతో భయపడి విధుల్లోకి రావడం లేదని ఓ ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థకు చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.  

More Telugu News