Nizamuddin Markaz: మత ప్రార్థనల కారణంగా సుమారు 9 వేల మందికి కరోనా ముప్పు!: కేంద్రం హెచ్చరిక

  • ఇండియాలో కరోనాకు అతిపెద్ద హాట్ స్పాట్ గా మర్కజ్
  • 36 గంటల ఆపరేషన్ తరువాత 2,335 మంది బయటకు
  • కరోనా లక్షణాలున్న వారు ఆసుపత్రులకు
9 thousand people who went to Markaz are in Danger

గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని, దీంతో దాదాపు 9 వేల మంది ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రమాదం అంచున ఉన్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఇండియాలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ ఈ ప్రార్థనలు జరిగిన మసీదేనని అభిప్రాయపడ్డ కేంద్రం, వైరస్ సోకిన వారి సంఖ్య 9 వేలకు మించే ఉండవచ్చని పేర్కొంది.

ఈ మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన వారిని గుర్తించేందుకు 23 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు నిర్విరామంగా పని చేస్తున్నారని కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 1 వరకూ 1,051 మందిని క్వారంటైన్ చేయగా, వారిలో 21 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించి, తబ్లిగీ జమాత్ లో పనిచేసిన 7,688 మంది స్థానిక కార్యకర్తలను, వారు కలిసిన వారిని, వారి కుటుంబీకులను క్వారంటైన్ చేస్తామని తెలిపారు.

అయితే, మర్కజ్ ప్రార్థనలతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించడం అధికారులకు కష్ట సాధ్యంగా మారిందని పీఎంఓ కార్యాలయ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అత్యధికులను గుర్తించినా, ఇంకా బయటకు రానివారి ద్వారా వ్యాధి ఎంతమందికి వ్యాపిస్తుందన్న అంశం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

కాగా, ఇప్పటివరకూ ఈ ప్రార్థనలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధమున్న 400 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రార్థనలతో సంబంధమున్న కేసులు తమిళనాడులో అత్యధికంగా 190 ఉండగా, ఆ తరువాతి స్థానంలో ఏపీ ఉంది. ఏపీలో 71, ఢిల్లీలో 28, తెలంగాణలో 28, ఆసోంలో 14, మహారాష్ట్రలో 12, అండమాన్ లో 10, జమ్మూ కశ్మీర్ లో 6, పుదుచ్చేరి, గుజరాత్ లో రెండేసి కేసులు పాజిటివ్ వచ్చాయి.

ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందితో పాటు మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి పలువురు తబ్లిగీ జమాత్ లో పాల్గొన్నారు. ఇక్కడి ఇరుకు వీధుల్లో వారంతా పలు దినాలు గడిపారు. ఆపై లాక్ డౌన్ అమలులోకి రాగా, దాదాపు 6,500 మంది తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.

సోమవారం ప్రారంభమై, దాదాపు 36 గంటల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం తబ్లిగీ జమాత్ నుంచి 2,335 మందిని బయటకు తీసుకుని రాగా, వీరిలో ఎంతమందికి కరోనా సోకిందన్న విషయం తేలాల్సివుంది. వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లకు తరలించగా, కరోనా లక్షణాలు కనిపించిన వారిని అధికారులు ఆసుపత్రుల్లో చేర్చారు.

More Telugu News