Yuvraj Singh: గంగూలీ మాదిరి వీరిద్దరూ నాకు సపోర్ట్ చేయలేదు: యువరాజ్ సింగ్

  • గంగూలీ నుంచి నాకు ఎంతో సహకారం అందింది
  • ధోనీ, కోహ్లీల నుంచి అంత సహకారం అందలేదు
  • కరోనా వైరస్ గురించి సరైన సమాచారాన్ని తెలుసుకోండి
They did not support me like Ganguly says Yuvraj Singh

విరాట్ కోహ్లీ, ధోనీతో పోలిస్తే కెప్టెన్ గా గంగూలీనే తనను ఎక్కువగా సపోర్ట్ చేశాడని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. గంగూలీ నుంచి తనకు ఎంతో సహకారం అందిందని చెప్పాడు. గంగూలీ తర్వాత ధోనీ కెప్టెన్ అయ్యాడని... ఇద్దరినీ పోల్చడం కష్టమని తెలిపాడు. గంగూలీ నాయకత్వంలో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. ధోనీ, కోహ్లీల నుంచి తనకు అలాంటి సహకారం అందలేదని తెలిపాడు.

2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా గంగూలీ నాయకత్వంలోనే యువరాజ్ టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడాడు. తన కెరీర్ లో యువీ మొత్తం 304 వన్డేలు ఆడాడు. వీటిలో 110 వన్డేలను గంగూలీ కెప్టెన్సీలో ఆడగా... 104 మ్యాచులను ధోనీ నాయకత్వంలో ఆడాడు.

కరోనా వైరస్ గురించి యువీ మాట్లాడుతూ, దానికి కూడా బలాలు, బలహీనతలు ఉన్నాయని చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది దానికి బలి కావడం ఆందోళనకు గురి చేస్తోందని, చాలా వేగంగా విస్తరిస్తోందని చెప్పాడు. దీని గురించి ఆందోళన చెందకుండా... డబ్ల్యూహెచ్ఓ, కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్లలోకి వెళ్లి ఈ మహమ్మారి గురించి తెలుసుకోవాలని సూచించాడు.

తనకు క్యాన్సర్ అని తెలిసిన తొలి నాళ్లలో ఎంతో భయపడ్డానని... ఆ తర్వాత దాని గురించి సరైన సమాచారం తెలుసుకుని, సరైన హాస్పిటల్, డాక్టర్ వద్దకు వెళ్లానని యువీ తెలిపాడు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎక్కువగా వస్తోందని... అందుకే అధికారిక సైట్లలోకి వెళ్లి, కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ప్రజలు చూడటం మానేయాలని హితవు పలికాడు. పుకార్లను వ్యాపింపచేయొద్దని కోరాడు.

More Telugu News