New Delhi: ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి.. నలుమూలలకూ కరోనా వ్యాపించిన తీరు!

  • మార్చి తొలి వారంలో ప్రార్థనలు
  • అక్కడే కరోనా వైరస్ ను అంటించుకుని స్వస్థలాలకు
  • వారి నుంచి వందల మందికి వైరస్ వ్యాప్తి
  • ఇప్పుడు కళ్లు తెరచిన అధికారులు
Covid 19 Spred form Markaz

న్యూఢిల్లీలో అత్యంత బిజీగా ఉండే హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ (బంగ్లేవాలీ మసీద్) మసీద్. ఇప్పుడా పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఇండియాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించడానికి ప్రధాన కారణం మార్చి తొలి వారంలో ఇక్కడ జరిగిన మతపరమైన ప్రార్థనలే. 'తబ్లిగీ జమాత్' పేరిట ఇక్కడ ఓ కార్యక్రమం జరుగగా, వేలాది మంది పాల్గొన్నారు. అప్పటికే కొవిడ్-19 విస్తరించిన సౌదీ అరేబియా, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి ఎంతో మంది వచ్చారు.

ఈ ప్రార్థనల అనంతరం అందరూ, తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారిలో కొందరికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ కొందరు ఇప్పటికే వందల మందికి వైరస్ ను అంటించారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చి, గత గురువారం నాడు మరణించగా, ఆ తరువాతే అతను కరోనా సోకి మరణించాడని తేలిందంటే, ఈ వైరస్ ఎంతటి మహమ్మారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

తమిళనాడు, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ ప్రార్థనలకు వందలాది మంది హాజరయ్యారు. వీరందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిన తరువాత ఎంతో మందిని కలిశారు. అదే ఇప్పుడు ఇండియా ముందున్న అతిపెద్ద సమస్యగా మారింది. ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో సంబంధాలున్న 1000 మందికి పైగా ప్రజలను ఇప్పుడు వైద్యాధికారులు నిత్యమూ పరిశీలిస్తున్నారు. వారిలో జ్వరం, జలుబు, ఊపిరి ఇబ్బందులు ఎవరికైనా సోకినట్టు అనుమానం వచ్చినా, ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఇక ఇంతటి ఉత్పాతానికీ కారణమైన బంగ్లేవాలీ మసీద్ నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. పశ్చిమ నిజాముద్దీన్ ప్రాంతంలో నిత్యమూ బిజీగా ఉండే నిజాముద్దీన్ అవూలియా దర్గా, గాలిబ్ అకాడమీలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఓ చిన్న ఎంట్రీ గేటు మాత్రమే ఉండే ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంటుంది. దీన్ని ఓ చిన్న కాలనీ అని చెప్పొచ్చు. ఇక్కడికి ప్రతినిత్యమూ ప్రార్థనల కోసం ఎంతో మంది వస్తుంటారు. ఫస్ట్ ఫ్లోర్ లోనే వేలాది మంది ఒకేసారి ప్రార్థనలు చేస్తుంటారు. మత పెద్దల ప్రసంగాలను వింటుంటారు. ఈ సోమవారం కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చారని, అయితే, వారిలో విదేశీయులు మాత్రం లేరని స్థానికులు వెల్లడించారు.

ఇక ఢిల్లీలో నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసుల్లో 18 కేసులు ఈ ప్రార్థనలకు హాజరైన వారివే. ఇక అధికారులు దాదాపు 300 మందిని లోక్ నాయక్ ఆసుపత్రిలో ఉంచి, వారిని అనుక్షణం పరిశీలిస్తున్నారు. ఇక తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత మాత్రమే నిలిపివేశారు. అంతకుముందు అత్యధికులు ఒకే చోట హాజరవుతున్నారని తెలిసినా కూడా అధికారులు కల్పించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  స్క్రీనింగ్ చేసే పరికరాలు ఇక్కడ అందుబాటులో లేవు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎవరు వచ్చారన్న సమాచారం కూడా లేదు. ఈ ప్రాంతంలోని స్థానికుల కోసం మెడికల్ క్యాంపులను సైతం ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాంతంలో సుమారు 30 వేల లీటర్ల సోడియం హైపోక్లోరైడ్ ను చల్లిన ఢిల్లీ కార్పొరేషన్ సిబ్బంది ఆపై చేతులు దులుపుకున్నారు. మహమ్మారి వ్యాపించిన తరువాత ఈ ప్రాంతంలో ఓ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.

ఇక ఈ ప్రాంతాన్నంతా పోలీసులు ఇప్పుడు తమ అధీనంలోకి తీసుకున్నారు. కేవలం గుర్తింపు పొందిన వారిని మాత్రమే వీధుల్లోకి అనుమతిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారు బస చేసే గెస్ట్ హౌస్ లు, డార్మిటరీలను శానిటైజ్ చేస్తున్నారు. ప్రజల కదలికలను అనుక్షణం గమనించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

More Telugu News