Mithali Raj: పది లక్షల విరాళం ప్రకటించి.. ఉదారతను చాటుకున్న మిథాలీ రాజ్

  • పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 5 లక్షల విరాళం
  • తెలంగాణ సీఎం సహాయ నిధికి మరో ఐదు లక్షలు
  • కరోనాపై పోరాటంలో అందరూ ఏకమవ్వాలని సూచన
Mithali Raj joins fight against COVID19 with Rs 10 lakh donation

కరోనా వైరస్‌పై  దేశం చేస్తున్న యుద్ధానికి క్రీడాకారులంతా తమ వంతు సహకారం అందిస్తున్నారు. సెల్ఫ్ క్వారంటైన్‌ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు, అజింక్యా రహానె, రోహిత్ శర్మ ఇప్పటికే తమకు తోచిన విరాళాలు ప్రకటించగా తాజాగా ఈ జాబితాలో భారత మహిళల వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా చేరింది.

కరోనాపై పోరాటానికి తన వంతుగా రూ. 10 లక్షల సాయం ప్రకటించి మంచి మనసు చాటుకుంది. ఈ మొత్తంలో ఐదు లక్షలు ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధికి, మరో ఐదు లక్షల రూపాయలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టు ప్రకటించింది. ‘ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరాటంలో మనమంతా చేతులు కలపాలి. నా వంతు చిన్న సాయంగా పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 5 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 లక్షలు ఇస్తున్నా’ అని మిథాలీ ట్వీట్ చేసింది.

పురుషులతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు జీతభత్యాలు, ప్రకటనల రూపంలో ఆదాయం తక్కువే అయినా మిథాలీ పెద్ద మొత్తంలో సాయం చేసింది. మహిళా క్రీడాకారుల్లో పీవీ సింధు, మిథాలీ రాజ్‌ మాత్రమే రూ. 10 లక్షల సాయం ప్రకటించడం విశేషం. మరో మహిళా క్రికెటర్, టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన పూనమ్ యాదవ్ రూ. రెండు లక్షల విరాళం ప్రకటించింది. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ లక్షా 25 వేలు అందించాడు.

More Telugu News