Andhra Pradesh: కొత్తగా 17 కేసులు... ఏపీలో 40కి చేరిన కరోనా రోగుల సంఖ్య!

17 New Corona Positive Cases in Andhrapradesh
  • బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ
  • అత్యధికులు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే
  • వారితో కాంటాక్ట్ లో ఉన్న వారికి కూడా సోకిన వ్యాధి
ఆంధ్రప్రదేశ్ పై కరోనా పంజా విసిరింది. ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం గత 12 గంటల్లో మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 40కి చేరింది. కొత్తగా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు ఢిల్లీలోని మత ప్రార్థనలకు హాజరైన వారు, మక్కాకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ లో ఉన్న వారే కావడం గమనార్హం.

డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో ఈ ఉదయం 10 గంటల వరకూ కరోనా నమోదైన కొత్త కేసుల వివరాలివి.

అనంతపురం, లేపాక్షిలో ఇద్దరికి (వీరిద్దరూ మక్కా వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయ్యారు), ప్రకాశం జిల్లాలో ఇద్దరు (ఒకరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్, మరొకరు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి), గుంటూరులో ఐదు కేసులు (కరోనా రోగికి దగ్గరగా ఉన్న మహిళ, ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకున్న ముగ్గురు, ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తి), కృష్ణా జిల్లాలో ఒకటి (ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తితో కాంటాక్ట్) ఉన్నాయి.

వీటితో పాటు ప్రకాశం జిల్లా కందుకూరు, చీరాల, కుంకల మర్రి ప్రాంతాల నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఆరుగురికి, తూర్పు గోదావరి జిల్లాలో మదీనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరికి ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, వీరితో కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని డైరెక్టరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగం పేర్కొంది.
Andhra Pradesh
New Corona Cases
17 Cases
Positive
Delhi Prayers

More Telugu News