Kerala: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మద్యం సరఫరా చేయాలంటూ కేరళ సీఎం ఆదేశాలు!

Kerala CM Vijayan makes key decision over liquor supply
  • లాక్ డౌన్ కారణంగా కేరళలో నిలిచిపోయిన మద్యం అమ్మకాలు
  • ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుగురు మందుబాబులు
  • డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మద్యం సరఫరా చేయాలన్న కేరళ సీఎం
  • సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టిన ఐఎంఏ
దేశంలో కరోనాతో విలవిల్లాడుతున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. ఇప్పుడక్కడ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో మద్యానికి బానిసైన వారి పరిస్థితి మరింత దిగజారింది. మద్యపానం లేనిదే తాము ఉండలేమన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు కేరళలో 9 మంది మద్యం దొరక్క మృతి చెందగా, మరో ఆరుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, ఒత్తిళ్లు పెరుగుతుండడంతో సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మద్యం సరఫరా చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. మద్యానికి బానిసైన వారిని డీ ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో మద్యం అమ్మకాల విషయాన్ని పరిశీలిస్తున్నామని విజయన్ పేర్కొన్నారు. అయితే సీఎం నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేరళ విభాగం తప్పుబట్టింది.

మద్యానికి బానిసైన వారికి శాస్త్రీయ చికిత్స అందించాలని, వారికి ఇంటి వద్ద కానీ, ఆసుపత్రిలో కానీ ఔషధాల ద్వారానే చికిత్స జరగాలని, అలాంటివారికి మద్యం అందించడం శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కాదని ఐఎంఏ స్పష్టం చేసింది.
Kerala
Liquor Ban
Pinarayi Vijayan
Corona Virus
Lockdown
IMA
India

More Telugu News