Lockdown: వీరిద్దరి వల్ల మా రాష్ట్రంలో లాక్ డౌన్ ఫెయిల్ అయింది: బీహార్ మంత్రి

  • కేజ్రీవాల్, యోగి వల్ల లాక్ డౌన్ విఫలమైంది
  • ఢిల్లీ, యూపీ నుంచి ప్రత్యేక బస్సుల్లో కార్మికులను పంపించారు
  • ప్రధాని ప్రకటన తర్వాత కూడా వీరిని ఎలా పంపిస్తారు?
Kejriwal and Yogi are reason for lockdown failure says Bihar minister

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై బీహార్ మంత్రి సంజయ్ ఝా మండిపడ్డారు. వీరిద్దరి వల్ల బీహార్ లో లాక్ డౌన్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల వల్ల వేలాది వలస కార్మికులు రాష్ట్రంలోకి వచ్చారని అన్నారు.

తమ ప్రభుత్వ ఆలోచన ప్రకారం వలస కార్మికులను తమ సరిహద్దు లోపలే స్పెషల్ క్యాంపులో ఉంచాలని అనుకున్నామని... అయితే తమ ప్రభుత్వంపై  ప్రజలు విమర్శలు గుప్పించడం ప్రారంభించారని... ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలకు లేని ఇబ్బంది మీకెందుకని నిలదీశారని సంజయ్ ఝా తెలిపారు.

తాను పనికట్టుకుని ఎవరినీ విమర్శించడం లేదని... లాక్ డౌన్ కు ప్రధాని పిలుపునిచ్చిన తర్వాత కూడా బస్సులను ఏర్పాటు చేసి వీరిని ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి, యూపీలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను  ఏర్పాటు చేశారని... వేలాది మందిని తరలించారని చెప్పారు. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుంచి కూడా కార్మికులు వచ్చారని... వీరి కోసం బస్సులను ఏర్పాటు చేసిన వారంతా ప్రధాని పిలుపును సీరియస్ గా పట్టించుకోనట్టేనని అన్నారు.

More Telugu News