Kishan Reddy: లాక్ డౌన్ పొడిగింపు ఉండకపోవచ్చు: కిషన్ రెడ్డి

Kishan Reddy says there may be no lock down extension
  • భారత్ లో క్రియాశీలక కేసుల సంఖ్య తక్కువన్న కిషన్ రెడ్డి
  • చాలామందికి క్వారంటైన్ పూర్తయిందని వెల్లడి
  • వారందరినీ త్వరలో డిశ్చార్జి చేస్తామని వివరణ
దేశంలో కరోనా మహమ్మారి భయంతో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కేసుల పెరుగుదల ఆగకపోవడంతో లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

తనవద్ద ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే కరోనా లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు దాదాపు లేవని అన్నారు. పెద్ద ఎత్తున విదేశాల నుంచి భారత్ కు తరలివచ్చినా, క్రియాశీలక కేసుల సంఖ్య 901గా ఉందని, మరణాలు 27 మాత్రమేనని వెల్లడించారు. రెండ్రోజుల్లో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విదేశాల నుంచి వచ్చిన చాలామందికి 14 రోజుల క్వారంటైన్ వ్యవధి పూర్తయిందని, వారందరనీ త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నవారిలో 10 శాతం మందిని పంపించివేశామని, మరో వారంలో ఈ డిశ్చార్జి శాతం 50కి చేరుతుందని తద్వారా కరోనాపై మనం పైచేయి సాధించినట్టే భావించాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగుతూ, ఇకపై కొత్త కేసులేవీ నమోదు కాని పక్షంలో లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని తెలిపారు.
Kishan Reddy
Lockdown
Corona Virus
India
COVID-19

More Telugu News