Luv Aggarwal: దేశంలో 25కి చేరిన కరోనా మరణాలు... ఇవాళ ఒక్కరోజే ఆరుగురి మృతి

Centre tells corona death toll in coumtry
  • కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశం
  • దేశంలో 979 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడి
  • కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామన్న అగర్వాల్
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో కరోనా పరిస్థితులపై తాజా వివరాలు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 979 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. దేశం మొత్తమ్మీద 25 మంది కరోనాతో మృతి చెందారని వివరించారు. మృతి చెందినవారిలో ఎక్కువగా మధుమేహ వ్యాధి, బీపీ, కిడ్నీ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. కాగా, దేశంలో కరోనా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 6 రాష్ట్రాల్లో కొత్తగా 106 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఆరుగురు మృతి చెందారని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు వెంటిలేటర్ పై ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని పంచుకోలేమని, రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని లవ్ అగర్వాల్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అటు, గూడ్సు రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, పెట్రోలియం, బొగ్గు సరఫరా చేస్తామని కేంద్రం పేర్కొంది. గత 5 రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్ల ద్వారా నిత్యావసర వస్తువుల రవాణా జరిగిందని వెల్లడించింది.
Luv Aggarwal
Corona Virus
India
COVID-19

More Telugu News