Infant: ప్రపంచంలో తొలిసారి... యూఎస్ లో కరోనా సోకి మృతిచెందిన రోజుల పసిబిడ్డ!

  • ఇల్లినాయిస్ లో ఘటన
  • కరోనా పాజిటివ్ తో మరణించిన పసికందు
  • విషయం తెలిసి వణికిపోయానన్న గవర్నర్
Infant Dies in USA with Corona Positive

కరోనా మహమ్మారి అమెరికాలో రోజుల పసిపాపను బలి తీసుకుంది. ఇల్లినాయిస్ లో శనివారం నాడు ఓ చిన్న బిడ్డ కొవిడ్-19 సోకి మరణించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. గత సంవత్సరం చైనాలోని వూహాన్ లో వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన తరువాత, వ్యాధి బారినపడి మరణించిన తొలి పసిబిడ్డ ఘటన ఇదే.

ఈ విషయాన్ని వెల్లడించిన ఇల్లినాయిస్ గవర్నర్ జేఫీ ప్రిట్జకర్, గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన వారిలో ఓ పసిపాప కూడా ఉందని తెలిపారు. ఈ బిడ్డ రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు. రోజుల చిన్నారికి కరోనా సోకి మరణించినట్టు ఇంతవరకూ లేదని తెలిపారు.

ఈ విషయం తెలిసి తాను వణికిపోయానని, బిడ్డ మరణానికి ఇతర కారణాలు కూడా సహకరించాయా? అన్న కోణంలో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ప్రిట్జకర్ వెల్లడించారు. ఈ వార్త ఎంత బాధను కలిగిస్తుందో తనకు తెలుసునని, ఇది దేశంలోని ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతుందని అన్నారు.

కాగా, గత వారంలో ఫ్రాన్స్ లో కరోనా సోకి 16 సంవత్సరాల బాలిక మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ యువతకు వ్యాధి సోకితే మరణించడం అత్యంత అరుదని భావిస్తుండగా, తాజా ఘటనలతో వైద్యాధికారులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News