తొలి సినిమాయే పవన్ కల్యాణ్ పక్కన... ఆపై అవకాశాల కోసం అలా కాంప్రమైజ్ కాలేకపోయా: నికిషా పటేల్

29-03-2020 Sun 06:37
  • అప్పట్లో నా అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారు
  • 'పంజా' ఫ్లాప్ కావడం కెరీర్ పై ప్రభావం చూపింది
  • ఆపై చిన్న సినిమాల్లో చేయాల్సి వచ్చిందన్న నికిషా
Nikisha Patel Comments on Casting Couch

తన తొలి తెలుగు చిత్రమే పవన్ కల్యాణ్ పక్కన చేయడంతో ఎంతో మంది నా అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారని, అయితే, అదృష్టంతో పాటే దురదృష్టం కూడా వెన్నాడిందని, ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆ ప్రభావం తన కెరీర్ పై పడిందని 'పంజా' హీరోయిన్ నికిషా పటేల్ వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని వచ్చిన తాను, ఆ కల ఫలించక పోగా, సర్దుకుపోయి, కొన్ని బడ్జెట్ సినిమాలు చేశానని, అది తన కెరీర్ కు మైనస్ గా మారిందని తెలిపింది.

కొందరు తాను కాంప్రమైజ్ అయితే, మరిన్ని అవకాశాలు వస్తాయని సలహాలు ఇచ్చారు. కానీ, ఆ విషయంలో తాను దిగజారలేదని, తనకు మంచి అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమని నమ్ముతున్నానని చెప్పింది. అయితే, ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఇదే అనుభవం ఎదురవుతుందని భావించడం లేదని, వారసత్వంగా వచ్చే వారికి, గుర్తింపు తెచ్చుకుని పాప్యులర్ అయిన వారికీ మినహాయింపు ఉంటుందని చెప్పుకొచ్చింది. కొందరు నూతన హీరోయిన్లకు ఏ మాత్రమూ విలువ ఇవ్వరని, సినీ పరిశ్రమకు ఎందుకు వచ్చామా? అని బాధపడేలా ప్రవర్తిస్తారని వాపోయింది.

ఇక తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తాను వివాహం చేసుకోవాలని భావిస్తే, అందరికీ చెప్పే చేసుకుంటానని, చెప్పకుండా చేసుకోబోనని వ్యాఖ్యానించింది. తనకు గతంలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అతనికి తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, దీంతో బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడని వెల్లడించిన నికిషా, అప్పటి నుంచి తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయాయని తెలిపింది.