Telangana: ఏప్రిల్ 9 తరువాత తెలంగాణలో కేసులు తగ్గే చాన్స్!

  • మరో పది రోజులు కేసుల సంఖ్య పెరిగే అవకాశం
  • ఈ కేసులన్నీ లాక్ డౌన్ కు ముందు సోకినవే నంటున్న వైద్య నిపుణులు
  • వ్యాధి సోకితే 14 రోజుల్లోగా కనిపించే లక్షణాలు
  • ప్రజలు ఆందోళన చెందవద్దంటున్న నిపుణులు
Corona Cases can Drop after April 9 in Telangana

తెలంగాణలో కరోనా కేసులు మరో పది రోజుల పాటు పెరుగుతూనే ఉంటాయని, అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో పాజిటివ్ వచ్చిన కేసులన్నీ లాక్ డౌన్ కు ముందు సోకినవేనని, అప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ లో ఉన్న వారికి మాత్రమే వ్యాధి సోకుతోందని వైద్యులు అంటున్నారు.

జనతా కర్ఫ్యూకు ముందు రోజు ప్రజలు యదేచ్ఛగా బయట సంచరించడం, లాక్‌ డౌన్‌ అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన ఉల్లంఘనల ప్రభావంతోనే ఇప్పుడు కేసుల సంఖ్య పెరిగిందని, ఈ పరిస్థితి ఏప్రిల్ 9 వరకూ కనిపించే అవకాశాలు ఉన్నాయని, లాక్ డౌన్ సక్సెస్ అయితే, ఆ తరువాత కేసుల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా, ఈ నెల 22న జనతా కర్ఫ్యూను అమలు చేయగా, ఆ విషయాన్ని రెండు రోజుల ముందే ప్రకటించడంతో, 21న ప్రజలు అత్యధికంగా బయటకు వచ్చి, తమకు కావాల్సిన నిత్యావసర సామాన్లు ఖరీదు చేశారు. ఆపై 23 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు ప్రారంభమైంది. సాధారణ పరిస్థితుల్లో కరోనా వైరస్ సోకిన తరువాత కనీసం 5 రోజుల తరువాత గరిష్ఠంగా 14 రోజుల మధ్య దాని లక్షణాలు బయటపడతాయి.

అంటే, లాక్‌ డౌన్‌ కు ముందు మార్చి 21వ తేదీ వరకూ తెలంగాణకు విదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. వారిలో ఎవరికైనా కరోనా సోకివుంటే, వచ్చే నెల 4వ తేదీలోగా వైరస్ లక్షణాలు బయటకు వస్తాయి. ఆపై మరో ఐదు రోజులు... అంటే, లాక్ డౌన్ ప్రారంభమైన ఐదో రోజు వరకూ వైరస్ ఎవరికైనా సోకివుంటే, వారు బయటకు వస్తారు.

లాక్ డౌన్ తొలి రోజుల్లో జరిగిన ఉల్లంఘనలు, హాస్టల్ విద్యార్థులు మూకుమ్మడిగా బయటకు రావడం వంటి కారణాలతో ఎవరికైనా వ్యాధి సోకివుంటే, వారి వివరాలు 9వ తేదీలోగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగి, అత్యధికులు ఇంటి పట్టునే ఉంటున్నారు కాబట్టి, ఆపై వైరస్ సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందని, తగ్గుదలను బట్టి, లాక్ డౌన్ కొనసాగింపు లేదా విరమణ నిర్ణయాలుఉంటాయని అంచనా వేస్తున్నారు.

More Telugu News