China: చైనాలో మూడు రోజుల తరువాత కొత్తగా కరోనా కేసులు... వెంటనే విమానాల నిలిపివేత!

  • విదేశాల నుంచి వచ్చిన 54 మందికి పాజిటివ్
  • 90 శాతం విమానాల రద్దు
  • వారంలో ఒక దేశానికి ఒకే విమానం నిబంధన
New Corona Cases in China

కరోనా వైరస్ జన్మించిన చైనాలో మూడు రోజుల తరువాత ఓ కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి చైనాకు వచ్చిన 54 మందికి వైరస్ సోకినట్టు వెలుగులోకి రావడంతో, చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటర్నేషనల్ విమానాల సంఖ్యను కుదించింది. తమ దేశంలో వైరస్ వ్యాప్తి తగ్గినా, విదేశాల నుంచి వచ్చే వారితో తిరిగి కేసులు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు, మరోసారి ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు.

గురువారం నాటికి కొత్త కేసుల సంఖ్య 55కు చేరిందని, దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 81,340 కాగా, ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 3,299కి చేరిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కాగా, ఇంతవరకూ విదేశాల్లో ఉన్న చైనీయులు స్వదేశానికి వస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో షాంఘైలో 17, గ్వాంగ్ డాగ్ లో 12, బీజింగ్ లో 4, తియాన్ జింగ్ లో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికి సోకిన కేసులేనని అధికారులు తెలిపారు.

ఇక చైనా ప్రభుత్వం వారంలో ఒక దేశానికి ఒకే విమానం వెళ్లాలని కొత్త నిబంధన జారీ చేసింది. విదేశీ ఎయిర్ లైన్స్ కంపెనీలకూ ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం విదేశాలకు తిరుగుతున్న విమానాల్లో 90 శాతం రద్దు చేశామని, ప్రయాణికుల సంఖ్యను రోజుకు 25 వేల నుంచి 5 వేలకు పరిమితం చేశామని అధికారులు తెలిపారు.

More Telugu News