Pawan Kalyan: తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు: పవన్ కల్యాణ్

  • పెద్దన్నగా ముందుకు వచ్చిన ‘చిరంజీవి గారికి’ నా కృతఙ్ఞతలు
  • ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు
  • సమాజం పట్ల తనకు ఉన్న ఆపేక్షను మహేశ్ బాబు చాటుకున్నారు
  • యువశక్తి జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించడం ముదావహం
Pawan Kalyan expreses his happiness about donations of Tollywood

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రెండు తెలుగు రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్రహీరోలు, నటులు, దర్శకులు, నిర్మాతలు తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు’ అంటూ విరాళాలిచ్చిన వారిని కొనియాడారు.

సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే తన పెద్ద అన్నయ్య చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నానని అన్నారు. ‘సినిమా’నే నమ్ముకుని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారని, ‘కరోనా’  దెబ్బతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన ‘చిరంజీవి గారికి’ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ధ్ర హృదయానికి జేజేలు పలుకుతున్నానంటూ ఓ పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన హీరోలు నితిన్, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, ‘అల్లరి’ నరేశ్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వి.వి.నాయక్, సతీశ్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ కు వరుస పోస్ట్ లలో తన ధన్యవాదాలు తెలిపారు. సినీ కార్మికులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించడానికి ముందుకు వచ్చిన హీరో రాజశేఖర్, నటుడు శివాజీరాజాలకు తన అభినందనలు తెలిపారు.

అదే విధంగా, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజు తన వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు ముందుగానే జీతాలు ఇచ్చి, సినీ కార్మికుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించడంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 11 మందికి ఆశ్రయం ఇవ్వడం ఆయనలోని పెద్ద మనసుకు నిదర్శనమంటూ కొనియాడారు.

More Telugu News