Jagan: కరోనా నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దు: సీఎం జగన్ సూచన

AP CM Jagan reviews corona situation in state
  • కరోనా పర్యవేక్షణపై కమిటీ ఏర్పాటు
  • ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు కేటాయింపు
  • కరోనా కారణంగా దేశానికి, రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సీఎం
కరోనాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బొత్స, మేకతోటి సుచరిత, ఆళ్ల నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏర్పాటు సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కమిటీ సభ్యులు నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు.

అంతకుముందు, మూడు నెలల బడ్జెట్ కు ఆమోదం కోసం ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. సీఎం జగన్ వ్యాఖ్యానిస్తూ, కరోనా కారణంగా దేశానికి, రాష్ట్రాలకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో భాగంగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిపైనా చర్చించారు. వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని సీఎం ఆదేశించారు. ఆయా రాష్ట్రాలు ముందుకు రాకుంటే వసతి ఖర్చు భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Jagan
Corona Virus
Andhra Pradesh
COVID-19

More Telugu News