Ward Valanteers: కరోనా సర్వే రిపోర్టు ఇచ్చేందుకు వెళుతున్న వలంటీర్లను కొట్టిన పోలీసులు!

  • రాజమహేంద్ర వరంలో ఘటన
  • ధర్నాకు దిగిన వార్డు వలంటీర్లు
  • సర్ది చెప్పిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
Police Lathichange on Ward Volenteers in Rajamahendravaram

విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిపై కరోనా రిపోర్టును తయారు చేసి, దాన్ని గ్రామ సచివాలయంలో ఇచ్చేందుకు వెళుతున్న వార్డు వలంటీర్లపై పోలీసుల లాఠీలు విరిగాయి. ఈ ఘటన రాజమహేంద్రవరంలోని రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. సర్వేను పూర్తి చేసుకున్న వలంటీర్లు వెళుతుండగా, ఏజీఎస్ పోలీస్ ఫోర్స్ వారిని అడ్డుకుని, విషయం చెబుతున్నా వినకుండా, 144 సెక్షన్ అమలులో ఉంటే, గుంపుగా తిరుగుతున్నారని ఆరోపిస్తూ, లాఠీలకు పని చెప్పారు.

జరిగిన ఘటనను తీవ్రంగా నిరసించిన వలంటీర్లు, తమ విధులను బహిష్కరించి, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు వలంటీర్లతో మాట్లాడి, వారిని ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు ఉంటాయని, నగరంలోని ప్రజల సంక్షేమం కోసం సర్వే విధులను ఎప్పటిలానే చేయాలని వారికి సర్ది చెప్పారు.

More Telugu News