Pondugula: సరిహద్దు వద్ద ఏపీ పోలీసులపై రాళ్ల దాడి... తీవ్రంగా స్పందించిన గౌతమ్ సవాంగ్!

Strict action Against Youth who pelt stones on AP Police
  • దాచేపల్లి సమీపంలోని పొందుగుల చెక్ పోస్ట్ వద్ద ఘటన
  • రాత్రి వేళ పోలీసులపై మూకుమ్మడి దాడి
  • కఠిన చర్యలు ఉంటాయన్న డీజీపీ 
తెలంగాణ పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వద్దకు చేరుకుని, అక్కడి పోలీసులపై రాళ్ల దాడికి దిగిన ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జరిగిన దాడి దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించిన ఆయన, ఇటువంటి చర్యలు గర్హనీయమని, రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రమిస్తున్న వేళ, బాధ్యతగల పౌరులుగా ఉండాల్సిన యువత, ఇలా రాత్రి సమయంలో దాడులు చేయడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఉన్న అధికారులు మెడికల్ ఎమర్జెన్సీ ప్రొటోకాల్ ప్రకారమే విధులు నిర్వహించారని, అన్ని రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసి వేయబడ్డాయని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు.

జిల్లాల మధ్య రాకపోకలు లేవని, గ్రామాలు కూడా స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయని అన్నారు. సరిహద్దులు దాటుకుంటూ కార్లు, బైక్ లపై పొందుగుల వద్దకు వందలాది మంది చేరుకున్న వేళ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చలు జరిగాయని అన్నారు. వారికి వైద్య పరీక్షలు చేసిన తరువాత, రాష్ట్రంలోకి అనుమతించాలని కూడా నిర్ణయించామని, ఈలోగా చీకటి పడగానే పోలీసులపై మూకుమ్మడి దాడి జరిగిందని అన్నారు.

ఈ దాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని, దాడిపై ఇప్పటికే కేసు నమోదైందని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలు అక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటారని, తెలంగాణలో ఉన్న ఏపీ వాసులకు అన్ని సదుపాయాలూ కల్పిస్తామని సీఎం కేసీఆర్ నుంచి హామీ వచ్చిందని అన్నారు. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే మంచిదని హితవు పలికారు.
Pondugula
Checkpost
Gautam Sawang
Andhra Pradesh
Telangana
Border
Corona Virus

More Telugu News