Jagan: గత రాత్రి పరిణామాలు ఎంతో బాధ కలిగించాయి: సీఎం జగన్

  • కరోనాను క్రమశిక్షణతోనే గెలవగలమని ఉద్ఘాటన
  • ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని సూచన
  • స్థల మార్పిడి వల్ల కరోనా బాధితులను కనుగొనడం కష్టమవుతుందని వెల్లడి
CM Jagan press meet over corona

లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోని హాస్టళ్లు మూసివేయడంతో వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఏపీలోని స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు. అయితే వారిని తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు నిలువరించారు. వారిని రాష్ట్రంలోకి అనుమతించలేమని స్పష్టం చేశారు. దాంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీనిపై సీఎం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాధులు బహుశా వందేళ్లకోసారి వస్తాయో లేదో కూడా తెలియదని, అసలు ఇలాంటి వ్యాధిని మనం చూడాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. దీన్ని మనం క్రమశిక్షణతోనే గెలవగలమని, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

"వివిధ దేశాల్లో కనిపిస్తున్న పరిస్థితులే అందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తదుపరి పరిణామాలను ఊహించలేం. నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిణామాలను చూసిన తర్వాత చలించిపోయాను. మన వాళ్లను మనం చిరునవ్వుతో ఆహ్వానించలేకపోతున్నామా? అని ఎంతో బాధపడ్డాను. పొందుగుల, నాగార్జునసాగర్, దాచేపల్లి చెక్ పోస్టుల వద్ద ఇవాళ కూడా అవే పరిస్థితులు కనిపించాయి.

నేను చెప్పేదొక్కటే. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి. అది అందరికీ శ్రేయస్కరం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్ల వారు కలిసిన వ్యక్తులను కనుగొనడం చాలా కష్టసాధ్యం. దాంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. దేశం అతలాకుతలం అవుతుంది. మన ఇంటికి మనం వెళ్లాలి అనే భావన వీడండి. ఇవన్నీ మరికొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఏప్రిల్ 14 వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉంటే వ్యాధిగ్రస్తులను గుర్తించడం చాలా సులభమవుతుంది. అలాకాకుండా, అక్కడివాళ్లు ఇక్కడికి, ఇక్కడివాళ్లు అక్కడికి వెళ్లడం వల్ల కరోనా సోకిన వ్యక్తులను గుర్తించడం ఏమంత సులభం కాదు.

దయచేసి ఈ మూడు వారాల పాటు ఎవరూ ఎక్కడికీ కదలవద్దు. మనం జాగ్రత్తగా ఉంటేనే ఈ కరోనా వైరస్ ను అరికట్టగలం. నిన్న రాత్రి రాష్ట్రాల సరిహద్దు వరకు వచ్చినవాళ్లలో 44 మందిని కాదనలేక అనుమతించాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లాలోనూ 150 మందిని తప్పనిసరి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో తీసుకున్నాం. వీళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచుతాం. అయితే తెలంగాణలోని ఆంధ్రుల క్షేమంపై సీఎం కేసీఆర్ ఎంతో సానుకూలంగా స్పందించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు ఏపీలో 10 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోని పరిస్థితికి సంతోషించాలి. దాన్ని ఇలాగే కాపాడుకోవాలంటే కఠినంగా వ్యవహరించకతప్పదు. స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఎంతమంచి వ్యవస్థ ఉన్నా ప్రయోజనం ఉండదు. కరోనా వస్తే వెంటనే ఆందోళన అవసరంలేదు. కరోనా సోకినా 80.9 శాతం ఇళ్లలో ఉండే నయం చేసుకోవచ్చు. కరోనా బాధితుల్లో కేవలం 14 శాతం మందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతుంది. అందులోనూ 4.8 శాతం మందికే ఐసీయూ వైద్య చికిత్సలు అవసరమవుతాయి. 60 ఏళ్లు పైబడిన వారు, బీపీ, కిడ్నీ వ్యాధులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

More Telugu News