Pakistan: కరోనా నేపథ్యంలో విమర్శల పాలవుతున్న పాకిస్థాన్ చర్య

Pakistan send corona positive people
  • పంజాబ్ ప్రావిన్స్ లో 300 కరోనా కేసులు
  • అందరినీ ఆక్రమిత కశ్మీర్ కు తరలిస్తున్న పాక్
  • స్థానికుల్లో అసంతృప్తి
పాకిస్థాన్ లోనూ కరోనా భూతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా 1000 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, పంజాబ్ ప్రావిన్స్ లో కరోనా బాధితులను పాక్ అధీనంలోని ఆజాద్ కశ్మీర్ (పాక్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతానికి తరలిస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో 300 వరకు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అక్కడ ఒక్క బాధితుడు కూడా ఉండరాదన్న ఉద్దేశంతో కరోనా సోకినవాళ్లను పాక్ ఆక్రమిత కశ్మీర్, బాల్టిస్థాన్, గిల్గిట్ తదితర ప్రాంతాలకు తరలిస్తోంది.

పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన కరోనా బాధితుల కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల స్థానిక సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున కరోనా బాధితులను ప్రత్యేక వాహనాల్లో తీసుకువస్తున్నారని, ఇది తమకు ముప్పుగా పరిణమిస్తుందని పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజలు వాపోతున్నారు. పంజాబ్ ను కరోనా రహితంగా మార్చేందుకు ఆజాద్ కశ్మీర్ ను డంపింగ్ యార్డుగా వాడుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Pakistan
Corona Virus
POK
Punjab

More Telugu News