Hyderabad: హైదరాబాదులో జాలీగా రోడ్లపైకి వచ్చి.. ఇలా చెప్పి తప్పించుకుంటున్న యువకులు

  • రక్తదానం కోసమని ఒకరు
  • తమవారు తప్పిపోయారని మరొకరు
  • పోలీసులకు మస్కా కొడుతున్న యువకులు
Youth coming on to roads to enjoy bike riding

లాక్‌డౌన్ వేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను చూసి ఆగలేకపోతున్న కుర్రకారు బైకు లేసుకుని ఎంచక్కా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాంగ్‌డ్రైవ్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. పోలీసులు వీరిని ఆపినప్పుడు చెబుతున్న కారణాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా వద్ద రాచకొండ పోలీసులకు దొరికిన ఓ యువకుడు చెప్పిన కథ పోలీసులను హైరానా పెట్టించింది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తమ ఫోన్‌లో ఓ వ్యక్తి ఫొటో చూపించి.. అతడు కనిపించడం లేదని, వెతుకుతూ ఇలా వచ్చామని చెప్పారు.

వారు చెప్పింది నమ్మిన పోలీసులు ఆ ఫొటో తీసుకుని అతడు కనిపిస్తే చెప్పాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించేందుకు రెడీ అయ్యారు. అయితే, యువకుల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపెట్టారు. రోడ్లు ఖాళీగా ఉండడంతో లాంగ్‌డ్రైవ్‌కు వచ్చామని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. నగరంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. రక్తదానం కోసం అంటూ ఒకరు, తమవారు ఆసుపత్రిలో ఉంటే చూడడానికి వెళ్తున్నామని మరొకరు ఇలా రకరకాల కారణాలు చెప్పి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

More Telugu News