Hyderabad: ప్రభుత్వ హెచ్చరికలతో.. హైదరాబాదులో భారీగా తగ్గిన కూరగాయల ధరలు!

  • హైదరాబాద్‌లో కిలో టమాటా రూ.30
  • పచ్చిమిర్చి రూ.50 
  • పలు రైతు బజార్లలో ప్రజల కొనుగోళ్లు
vegetable rates in hyderabad

తెలంగాణలో కూరగాయల వ్యాపారులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని సొమ్ము చేసుకుంటున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ధరలు పెరిగిపోతాయన్న అపోహ ప్రజల్లో నెలకొనడంతో నిన్న రైతు బజార్ల వద్దకు భారీగా వచ్చారు. ఇదే అదునుగా వ్యాపారులు కూరగాయల ధరలు పెంచేశారు.

మొన్న టమాటా కిలో ధర రూ. 8గా ఉండగా నిన్న వ్యాపారులు కిలో రూ.100కి అమ్మారు. అన్ని కూరగాయల ధరలూ ఇలాగే పెంచేశారు. దీంతో ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేయడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. ఈ రోజు హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్‌, గడ్డి అన్నారం, కొత్త పేట, మెహిదీపట్నం, ఎర్రగడ్డ మార్కెట్లలో టమాటా కిలో రూ.30, పచ్చిమిర్చి రూ.50కే అమ్ముతున్నారు. వీటితో పాటు అన్ని కూరగాయల ధరలు తగ్గాయి. పలు రైతు బజార్లలో ప్రజల కొనుగోళ్లు పెరిగాయి. ఇంట్లో సరుకులు నింపి పెట్టుకోవాలన్న అత్యాశతో నిన్న మార్కెట్లలోకి ప్రజలు హడావుడిగా వెళ్లి నిత్యావసర సరుకులు కొనుక్కున్నారు.

More Telugu News