Alla Nani: ఒంగోలులో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయించాం: ఆళ్ల నాని

AP health minister Alla Nani reviews corona positive case in Ongole
  • ఒంగోలులో కరోనాపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష
  • ఒంగోలు పాజిటివ్ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందన్న మంత్రి 
  • జిల్లాకు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించామని వెల్లడి
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఒంగోలులోనూ పాజిటివ్ కేసు నమోదైందని, ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమీక్షిస్తున్నామని చెప్పారు. ఒంగోలు పాజిటివ్ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. మరోసారి అతని శాంపిల్స్ ల్యాబ్ కు పంపిస్తున్నామని అన్నారు. ఒంగోలు పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించామని తెలిపారు.

ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని కూడా గుర్తించామని, వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి ఐసోలేషన్ వార్డుల్లో, హోమ్ క్వారంటైన్ లో ఉంచామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని, జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆందోళన చెందనవసరంలేదని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ఆళ్ల నానితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్, అధికారులు పాల్గొన్నారు.
Alla Nani
Corona Virus
Ongole
Prakasam District
Andhra Pradesh

More Telugu News