KLM Royal Dutch Airlines: ల్యాండింగ్ కు అనుమతి నిరాకరణ.. 90 మంది భారతీయులతో వచ్చిన విమానం యూటర్న్!

  • డెన్మార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన కేఎల్ఎం డచ్ ఎయిర్ లైన్స్ విమానం
  • ఈ నెల 18నే యూరోపియన్ దేశాల నుంచి విమాన రాకపోకలను నిషేధించిన భారత్
  • విమానం వెనక్కి మళ్లడంతో తీవ్ర ఆందోళనకు గురైన భారతీయులు
Amsterdam to Delhi Flight Makes U Turn As India Denies Permission To Land

కరోనా నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంకాని దేశంలో ఉంటూ సొంత మనుషుల మధ్యకు కూడా రాలేని నిస్సహాయ స్థితిలో గడుపుతున్నారు. మరోపక్క, కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా విదేశీ విమానాలకు భారత్ అనుమతి నిరాకరించడంతో... వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

తాజాగా ల్యాండింగ్ కు అనుమతి లభించకపోవడంతో... డెన్మార్క్ నుంచి వచ్చిన విమానం వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఆమ్ స్టర్ డ్యామ్ నుంచి ఢిల్లీకి కేఎల్ఎం డచ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నిన్న వచ్చింది. ఈ విమానంలో 90 మంది భారతీయులు ఉన్నారు. అయితే, విమానం ల్యాండ్ కావడానికి అనుమతించబోమని అధికారులు విమాన క్రూ సిబ్బందికి స్పష్టం చేశారు.

వాస్తవానికి యూరోపియన్ దేశాల నుంచి విమాన రాకపోకలను భారత్ ఈనెల 18నే బంద్ చేసింది. అయినప్పటికీ ఈ విమానం భారత్ కు రావడం విశేషం. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు చెందిన అధికారులు మాట్లాడుతూ, తమ గైడ్ లైన్స్ ను కేఎల్ఎం ఎయిర్ లైన్స్ అనుసరించలేదని చెప్పారు. నిర్ధారిత ఫ్లైట్ ప్లాన్ లేకుండానే వారు మన దేశంలోకి వచ్చారని అన్నారు. అందువల్లే ఆ విమానం ల్యాండ్ కావడానికి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.
 
విమానం ల్యాండింగ్ కు అధికారులు అనుమతిని నిరాకరించడంతో... అందులో ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. కాసేపట్లో ల్యాండ్ అవబోతున్నామంటూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఎంతో సంతోషంతో మెసేజ్ లు పంపిన ప్రయాణికులు... విమానం వెనక్కి వెళుతోందనే అనౌన్స్ మెంట్ తో తీవ్ర నిరాశకు గురయ్యారు.  

మరోవైపు, రేపు ఉదయం 5.50 గంటల నుంచి అన్ని విదేశీ విమానాల రాకపోకలను భారత్ బంద్ చేస్తోంది. అంటే, ప్రపంచంతో భారత్ కు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టే. మార్చి 29 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి... మన దేశం నుంచి ఏ ఒక్కరూ ఇతర దేశాలకు వెళ్లడం కానీ... ఇతర దేశాల నుంచి మన దేశానికి రావడం కానీ జరగదన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే విమానం దేశ సరిహద్దులను దాటే పరిస్థితి ఉంటుంది.

More Telugu News