Nirbhaya: అర్ధరాత్రి సుప్రీం తలుపు తట్టిన నిర్భయ దోషులు.. చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలం!

  • పటియాలా హౌస్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టుకు
  • హైకోర్టు సమర్థించడంతో సుప్రీంకు
  • అర్ధరాత్రి అత్యవసరంగా విచారించిన అత్యున్నత ధర్మాసనం
Nirbhaya Convicts filed petition at Supreme court for final Chance

నిస్సిగ్గుగా కీచకపర్వానికి తెగబడి, ఆపై నిబ్బరంగా ఉంటూ శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రోజూ ఏదో ఒక సాకుతో కోర్టులను ఆశ్రయిస్తూ శిక్ష అమలును వాయిదా వేసే ప్రయత్నం చేసిన దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలు.. చట్టపరంగా తమకు ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. చివరికి పటియాలా హౌస్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. నిన్న సాయంత్రం అక్కడా వారికి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో ఉరిశిక్షను అమలు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో నిన్న రాత్రి అప్పీలు చేశారు.

జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం దోషుల పిటిషన్‌ను అర్ధరాత్రి అత్యవసరంగా విచారించింది. దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో శిక్ష అమలుకు లైన్ క్లియర్ అయింది. దోషులను ఉరితీసే ముందు వారిని కలిసేందుకు కుటుంబ సభ్యులకు ఐదు, పదినిమిషాల సమయం ఇవ్వాలని వారి తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోరారు. ఇందుకు జైలు నియమాలు అనుమతించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తేల్చి చెప్పారు. మరోవైపు, ఉరిశిక్ష అమలుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో తీహార్ జైలు అధికారులు ఈ ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.

More Telugu News