KCR: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించా: సీఎం కేసీఆర్​

  • ‘కరోనా’పై సమీక్షించిన కేసీఆర్ 
  • విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేయాలి
  • రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం
Due to corona virus Cm Kcr orders to officers

కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి  తెలంగాణ రాష్ట్రానికి  వచ్చిన వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ‘కరోనా’పై అత్యున్నత స్థాయి సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేయాలని ఆదేశించారు.

మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని ఆదేశించానని, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆ వివరాలు సేకరిస్తున్నారని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు స్వచ్ఛందంగా రిపోర్టు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సరిహద్దుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తామని అన్నారు.

దేశంలో 166 మందికి, తెలంగాణలో 14 మందికి  ‘కరోనా’ పాజిటివ్ వచ్చిందని అన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఐదుగురు మాత్రమే విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారని, మిగిలిన వారు ఇతర ఎయిర్ పోర్టుల్లో దిగి వివిధ రవాణా మార్గాల ద్వారా రాష్ట్రానికి చేరుకున్నారని వివరించారు. ఇక్కడి వాళ్లకు ఎవరికీ ఈ వైరస్ సోకలేదని, ఆందోళన చెందవద్దని అన్నారు. పదో తరగతి పరీక్షలను కొనసాగిస్తామని, టెన్త్ పరీక్షా కేంద్రాల్లో ఎక్కువ శానిటైజ్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్లొద్దని, గుంపులు గుంపులుగా ఉండొద్దని, తగు జాగ్రత్తలు పాటించడమే ‘కరోనా’ నుంచి ‘శ్రీరామరక్ష’ అని ప్రజలకు పిలుపు నిచ్చారు.

More Telugu News