Chandrababu: లేఖ వాస్తవం కాకపోతే ఎస్ఈసీ ఎప్పుడో స్పందించి ఉండేవారు: మీడియా సమావేశంలో చంద్రబాబు

Chandrababu press meet over SEC letter to Centre
  • మీడియాకు లేఖ చదివి వినిపించిన చంద్రబాబు 
  • లేఖ పట్ల ప్రభుత్వం సిగ్గుపడాలంటూ వ్యాఖ్యలు
  • లేఖకు అనుగుణంగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వచ్చాయని వెల్లడి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాసినట్టు ఉదయం నుంచి మీడియాలో కథనాలు వస్తున్నాయి. తనకు, తన కుటుంబానికి ముప్పు ఉందన్నదే లేఖ సారాంశమని ఆ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ లేఖ ప్రతిని చదివి వినిపించారు.

భద్రత ఉంటేనే తప్ప విధులు నిర్వర్తించలేనని ఓ ఎన్నికల కమిషనర్ తన లేఖలో పేర్కొనడం పట్ల ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత ఓ వర్గం తన రాజకీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం కోసం తనను బెదిరింపులకు గురిచేస్తోందని, అయినప్పటికీ తాను కర్తవ్య నిర్వహణకు, తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు ఎస్ఈసీ పేర్కొన్నట్టు చంద్రబాబు చదివి వినిపించారు.

ఆయన తన భద్రత కోరుతూ ఏ అభ్యర్థన అయితే చేశారో, అందుకు అనుగుణంగా ఆయన కార్యాలయం వద్దకు, ఇంటి వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు వచ్చాయని తెలిపారు. ఈ లేఖ వాస్తవం కాకపోతే ఎస్ఈసీ ఎప్పుడో స్పందించి ఉండేవారని అన్నారు. హైకోర్టు జడ్జితో సమాన స్థాయి కలిగిన వ్యక్తి మీ అరాచకాలు, మీ రాక్షస చర్యలపై కేంద్రాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ తన లేఖలో రాష్ట్రంలో అనేక చోట్ల దిగ్భ్రాంతికర రీతిలో ఏకగ్రీవం అయిన విషయాన్ని కూడా ప్రస్తావించారని, ఇవే అంశాలను విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయని తెలిపారు.
Chandrababu
SEC
Letter
Jagan
YSRCP
Andhra Pradesh
Local Body Polls

More Telugu News