India: ఇదేమీ ఆషామాషీ కాదు... లాక్ డౌన్ ప్రకటించండి: నరేంద్ర మోదీకి 51 మంది పారిశ్రామికవేత్తల విజ్ఞప్తి!

  • కరోనా మహమ్మారిని తక్కువగా అంచనా వేయవద్దు
  • దేశవ్యాప్తంగా 144 సెక్షన్, పరిశ్రమల మూసివేతను ప్రకటించండి
  • సవివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారీ
Enterprenurers wants complete Shut down

కరోనా మహమ్మారిని తక్కువగా అంచనా వేయవద్దని, వెంటనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, పరిస్థితిని కంట్రోల్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని 51 మంది పారిశ్రామికవేత్తలు, వెంచర్ కాపిటలిస్టులు కోరారు. ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఇండియా మొత్తం కనీసం వారం రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని, పరిశ్రమలన్నింటికీ లాక్ డౌన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఓ సవివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తయారు చేసిన అర్బన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అభిరాజ్ సింగ్ భల్, సౌత్ కొరియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలు, ముందుగానే స్పందించి, కఠినమైన నిర్ణయాలు తీసుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టాయని ఉదాహరణలతో సహా వెల్లడించారు.

ఇదే సమయంలో ఇరాన్, ఇటలీ, అమెరికా వంటి దేశాలు వేచి చూసే ధోరణితో ఉండిపోబట్టే, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయని, ఆ దేశాల్లో కరోనా విజృంభించిందని తెలిపారు. దేశ పౌరులందరూ కనీసం రెండు వారాల పాటు ఇళ్లలోనే ఉండిపోవాలని, అప్పుడే వైరస్ నియంత్రణలోకి వస్తుందని, అన్ని రకాల రవాణా వ్యవస్థలను నిలిపివేయాలని, పాలన స్తంభించినా, ప్రజారోగ్యానికి ఇదే క్షేమమని వెల్లడించారు. ఈ తరహా చర్యలతో 30 రోజుల తరువాత కరోనా మరణాల సంఖ్య ఐదు రెట్లు తగ్గుతుందని ఈ ప్రజంటేషన్ లో ఎంటర్ ప్రెన్యూరర్స్ అంచనా వేశారు.

ఇక ఈ ప్రజెంటేషన్ ను తయారు చేసిన టీమ్ లో స్నాప్ డీల్ కునాల్ భల్, రెడ్ బస్ ఫణీంద్ర సామా, మ్యాప్ మై ఇండియా రోహన్ వెర్జామా తదితరులు ఉన్నారు. ఇండియా తీసుకున్న చర్యల్లో మాల్స్, సినిమా హాల్స్ మూసివేయాలన్న నిర్ణయాలు కొంత మేరకు వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు సహకరిస్తాయని, ఇదే సమయంలో రెండో దశ లాక్ డౌన్ ను తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలైన ఆహారం, మందులు, డబ్బులతో పాటు అత్యవసర ప్రయాణాలకు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాలని వారు కోరారు.

More Telugu News