శాసన మండలికి కవిత.. నేడు నామినేషన్ దాఖలు చేయనున్న కేసీఆర్ తనయ

18-03-2020 Wed 06:33
  • కవిత పేరును నేడు అధికారికంగా ప్రకటించనున్న కేసీఆర్
  • ఆ వెంటనే నామినేషన్ దాఖలు
  • గెలుపు నల్లేరుమీద నడకే
TRS Leader K Kavitha will file Nomination for Council

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత శాసన మండలికి వెళ్లనున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కవిత పేరును అధికారికంగా నేడు ప్రకటించే అవకాశం ఉంది. పేరు ప్రకటించిన వెంటనే ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు.

ఇక ఈ స్థానం నుంచి ఎన్నికయ్యే వారు జనవరి 2022 వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత కూడా వారే కొనసాగే అవకాశం ఉండడంతో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్, పార్టీ నేతలు నర్సింగ్‌రావు, ఈగ గంగారెడ్డి తదితరులు పోటీపడ్డారు. అయితే, సీఎం కేసీఆర్ మాత్రం కవితవైపే మొగ్గుచూపారు.

2015లో ఇక్కడి నుంచి ఎన్నికైన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ అయింది. రేపటితో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనున్న నేపథ్యంలో కవిత నేడు తన నామినేషన్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లలో అత్యధికులు టీఆర్ఎస్ వారే కావడంతో కవిత గెలుపు నల్లేరు మీద నడకేనని చెబుతున్నారు. కవిత పేరు ఖరారైన నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు నేడు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు.