Andhra Pradesh: రాష్ట్రానికి వచ్చిన ఆ 840 మందినీ గుర్తించాం: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ బులెటిన్

  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  • కరోనాపై వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
  • కరోనాపై నిరంతర సమీక్ష చేస్తున్నాం 
AP health ministry releases special bulletin on corona

రాష్ట్రంలో కరోనా వైరస్ తీరుతెన్నులపై ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని వెల్లడించింది. అతడిని 14 రోజుల తర్వాత మరోసారి పరీక్షించి డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో కరోనాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆ బులెటిన్ లో హెచ్చరించింది. రాష్ట్రంలో మాస్కులు, శానిటైజర్ల కొరత రానివ్వబోమని, కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.

"కరోనాపై నిరంతర సమీక్ష చేస్తున్నాం, ప్రజలు ఆందోళన చెందవద్దు. కరోనా అనుమానితుల గురించి 0866-2410978 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలి. అనుమానితులు వెంటనే దగ్గరున్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలి. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలి. కరోనా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 840 మందిని గుర్తించాం. 560 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వారిలో 250 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయింది. 30 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. 92 మంది శాంపిల్స్ ల్యాబ్ కు పంపగా, 75 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది.

కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవాళ్లు ఇళ్లలోనే ఉండాలి. వారు బయటకు రాకూడదు, కుటుంబ సభ్యులు, ఇతరులతో కలవకూడదు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంటువ్యాధుల చట్టం-1897ను నోటిఫై చేశాం. ఈ చట్టాన్ని నోటిఫై చేయడం వల్ల జిల్లా కలెక్టర్లు, వైద్యశాఖ అధికారులకు మరిన్ని అధికారాలు లభిస్తాయి" అని బులెటిన్ లో వివరించారు.

More Telugu News