Telugu Students: కరోనా ఎఫెక్ట్.... కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు

  • ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థులు
  • కరోనా భయంతో కాలేజీలకు సెలవులు
  • కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో విద్యార్థులను అడ్డుకున్న అధికారులు
Telugu students stranded in Kaulalampur airport

కరోనా వైరస్ భూతం ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. తాజాగా, పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్థులు స్వదేశానికి రాలేక కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వారందరూ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు సెలవులు ఇవ్వడంతో వారు భారత్ బయల్దేరారు. కానీ వారు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకోగానే అక్కడి అధికారులు అడ్డుకున్నారు.

వారు కౌలాలంపూర్ లో మరో విమానం ఎక్కాల్సి ఉండగా, అక్కడి నుంచి భారత్ కు వెళ్లాలంటే భారత దౌత్యాధికారుల అనుమతి ఉండాల్సిందేనని మలేసియా అధికారులు తేల్చి చెప్పారు. దాంతో గత మూడు రోజులుగా వందలమంది తెలుగు విద్యార్థులు కౌలాలంపూర్ విమానాశ్రయంలో కాలం గడుపుతున్నారు. విదేశాలకు విమాన సర్వీసులను భారత్ నిలిపివేయడం కూడా తెలుగు విద్యార్థుల పరిస్థితికి సగం కారణం. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలుగు విద్యార్థులు కోరుతున్నారు. కాగా, తమ బిడ్డల పరిస్థితి పట్ల తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

More Telugu News