Corona Virus: కరోనా కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువ... ఏపీలో ఒక్కటే!

Maharashtra tops in corona positive cases in country
  • దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137
  • మహారాష్ట్రలో 36 కేసులు నమోదు
  • 24 కేసులతో రెండోస్థానంలో కేరళ
ఇప్పుడు మానవాళికి మొత్తం ఉమ్మడి శత్రువు కరోనా వైరస్ ఒక్కటే!  అన్ని దేశాలు ఈ మహమ్మారి జపం చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. భారత్ లోనూ ఇది క్రమంగా ఉనికిని చాటుకుంటోంది. ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదవగా, మూడు మరణాలు సంభవించాయి. తాజాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్యను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశం మొత్తమ్మీద 137 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ (24) ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో 14, కర్ణాటకలో 11 మంది కరోనా బాధితులు ఉన్నట్టు గుర్తించారు.

ఏపీ విషయానికొస్తే, కేవలం ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు ఉన్నట్టు వెల్లడైంది. తెలంగాణలో 3 కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాదులో ఒక మరణం సంభవించినా అది కర్ణాటక ఖాతాలోకి వెళ్లింది. కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడికి కరోనా సోకగా మెరుగైన చికిత్స కోసం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. మొత్తమ్మీద భారత్ లో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే కరోనా ఉనికి వెల్లడైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Corona Virus
India
Maharashtra
Andhra Pradesh
Kerala
Positive

More Telugu News