Corona Virus: కరోనా ఉన్నా లేదని చెబితే.. శ్రీలంకలో ఆరు నెలల జైలు శిక్ష!

  • వైరస్‌ను అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం కఠిన చర్యలు 
  • క్వారంటైన్‌కు సహకరించని ప్రయాణికులను వారెంట్‌ లేకుండా అరెస్ట్
  • లంకలో ఇప్పటిదాకా 18 మందికి సోకిన కరోనా
6 months jail for people hiding corona symptoms in srilanka

తమ దేశంలో ఎవరైనా కరోనా లక్షణాలను దాచిపెడితే ఆరు నెలల జైలు శిక్ష విధించాలని శ్రీలంక నిర్ణయించింది. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి, వాటిని దాచిపెట్టినట్లు తెలిస్తే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి శ్రీలంకకు వస్తున్న కొందరు ప్రయాణికులు క్యారంటైన్ సెంటర్లకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. వాళ్లతోనే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.

క్వారంటైన్‌కు సహకరించని వ్యక్తులను ఎలాంటి వారెంట్‌ లేకుండా అరెస్ట్ చేస్తామని డీఐజీ అజిత్‌ రోహణ ప్రకటించారు. క్వారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దేశ వ్యాప్తంగా ఒక్కో పోలీస్‌ స్టేషన్‌కు ఏడుగురు అధికారులను నియమించామని చెప్పారు. కాగా, శ్రీలంకలో ఇప్పటిదాకా 18 కరోనా కేసులు నమోదయ్యాయి. వారందరికీ కొలంబో నగర శివార్లలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News